వైభవంగా అజో – విభొ – కందాళం ఫౌండేషన్, జాషువా సాంస్కృతిక వేదిక నాటికల పోటీలు
న్యూస్ తెలుగు/విజయవాడ : నాటక రంగానికి పునర్జీవం చేయాలనే లక్ష్యం, భారతీయ, సాంస్కృతిక, సాహిత్య వైభవాన్ని కాపాడే లక్ష్యంగా అజో – విభొ – కందాళం ఫౌండేషన్, జాషువా సాంస్కృతిక వేదికల ఆధ్వర్యంలో నాటికల పోటీలు, సాహిత్య సదస్సులు, విశిష్ట వ్యక్తులకు గౌరవ పురస్కారాల ప్రదాన కార్యక్రమాలు రెండురోజులుగా ఉత్సాహ పూరిత వాతావరణంలో జరుగుతున్నాయి. విజయవాడ గవర్నరుపేటలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం (ఎంబివికె)లో ఈ నాటిక పోటీలు గురువారం ప్రారంభమైన విషయం తెలిసిందే. అజో – విభొ – కందాళం ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ (యుఎస్‌ఎ), అజో – విభొ – కందాళం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.వి.రామానుజాచార్యులు, జాషువా సాంస్కృతిక వేదిక కన్వీనర్ గుండు నారాయణరావు, తెలుగు డ్రామా నిర్వాహకులు డి.రామకోటేశ్వరరావు, రంగస్థల ప్రముఖులు, సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వైఎస్ కృష్ణేశ్వరరావు, ఉత్సవాల ప్రిన్సిపల్ కోఆర్డినేటర్ జి.వి.రంగారెడ్డి, ప్రతినిధి చలసాని కృష్ణప్రసాద్ తదితరులు సమన్వయం చేస్తున్నారు. పలువురు నాటక రంగ, సినీ, సాహిత్య ప్రముఖులు ఉత్సాహపూరిత వాతావరణంలో పాల్గొంటున్నారు. గురువారం హైదరాబాద్‌కు చెందిన కళాంజలి కళాకారుల ‘అన్నదాత’ నాటికను అనకాపల్లికి చెందిన షిరిడీ సాయి కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు హృద్యంగా ప్రదర్శించారు.
రాత్రి 8 గంటలకు రెండో ప్రదర్శనగా ‘వేదాంతం’ నాటిక, మూడో ప్రదర్శనగా రాత్రి 9.30 గంటలకు ‘వర్క్‌ఫ్రం హోం’ ప్రదర్శితమయ్యాయి. శుక్రవారం ‘(అ) సత్యం’, అనశ్వరం, ‘బ్రహ్మస్వరూపం’ నాటిక ప్రదర్శనలు జరిగాయి. అబద్ధమాడితే వచ్చే అనర్థాలే ‘(అ)సత్యం’ ఉదయం నిద్ర లేచిన మొదలు నిద్రకు ఉపక్రమించే వరకూ అనేక పనులు నిర్వహిస్తుంటాం. తెలిసి కొన్నీ, తెలియక కొన్ని, కావాలని చేసేస్తుంటాం. సమాజంలో మంచీ, చెడూ రెండూ ఉంటాయి. నాణేనికి రెండు వైపులా అన్నట్లుగా మనుషుల్లోనూ మంచివారూ, చెడ్డవారూ ఉంటారు. సత్యం అంటే నిజం చెప్పేవారు. ఎప్పుడూ తమ నిజాయితీని ప్రదర్శిస్తుంటారు. అదే అబద్ధాలు చెప్పేవారు నిరంతరం ఎవరో ఒకరిపై చేతులు పెట్టి మోసాలను కొనసాగిస్తూనే ఉంటారు. మంచి, చెడు విచక్షణ ఉండకపోతే సమాజంలో జరిగే అనర్థాలను పట్టిచూపిన నాటిక ‘(అ)సత్యం’. విశాఖపట్టణానికి చెంది న శ్రీచైతన్య కళాస్రవంతి కళాకారులు ప్రదర్శించారు. మూలకథ సుధా మోదుగు, నాటకీకరణ పిన్నమనేని మృత్యుంజయరావు, దర్శకత్వం పి.బాలాజీనాయక్. సాయంత్రం 6.15 నుంచి 7.30 వరకు, “సరిలేరు నీకెవ్వరు” విశిష్ట దళిత సాహిత్య పురస్కార ప్రదానం జరిగింది. డా. కోయి కోటేశ్వరరావును ఈ అవార్డుతో ఘనంగా సత్కరించారు.
నోరు అదుపులో లేకపోతే ‘అనశ్వరం’ నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. డాబు, దర్పం, అహంకారాన్ని ప్రదర్శిస్తే ఎవ్వరూ దగ్గరకు రానివ్వరు. అవసరానికి మించి ఏదీ అతిచేయరాదు. అవసరం వచ్చినప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు స్పందించటం ముఖ్యం. అవసరమైనప్పుడు స్పందించటం, సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడటం, చావైనా, రేవైనా తేల్చుకోవటం కూడా ముఖ్యమే. ఇలాంటి విషయాలను పట్టిచూపుతూ సాగిన నాటిక ‘అనశ్వరం’ రాత్రి 8 గంటలకు ప్రదర్శించారు.. మూలకథ, నాటకీకరణ బర్రె సత్యనారాయణ, దర్శకత్వం డివి.చంద్రశేఖర్. విజయవాడకు చెందిన శ్రీకృష్ణా ఆర్ట్ థియేటర్ వారు ప్రదర్శించారు. ప్రకృతి ప్రకోపిస్తే ‘బ్రహ్మస్వరూపం’ ప్రపంచం, మానవత్వంమనిషికి, దైవత్యానికి మధ్య రాత్రి 9.30 గంటలకు ‘బ్రహ్మస్వరూపం’ను విజయవాడకు చెందిన మైత్రీ కళానిలయం కళాకారులు ప్రదర్శించారు. మనిషి తన స్వార్థం కోసం ప్రకృతి వనరులను నాశనం చేస్తున్నాడు. అవసరానికి మించి సంపాదించుకోవటం, తనే ఎదగాలి, బాగా సంపాదించాలి, అందరికంటే నేనే ఐశ్వర్యవంతుడు కావాలనే దురాశతో ప్రకృతి వనరులను సైతం నాశనం చేస్తుంటాడు. జల, వాయు, భూ కాలుష్యాలకు తెగబడుతున్నాడు. ఇలా పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తున్న క్రమంలో మనిషిలో అహాన్ని ధ్వంసం చేసేందుకు దేవుడు విపత్తులు సృష్టిస్తుంటాడు. ఈ క్రమంలో తాము చేసిన తప్పులను తెలుసుకునే ఇతివృత్తంగా సాగిన ఈ నాటిక ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. (Story : వైభవంగా అజో – విభొ – కందాళం ఫౌండేషన్, జాషువా సాంస్కృతిక వేదిక నాటికల పోటీలు)