పట్టణ వ్యవసాయ కూలీలకు అన్యాయం : సిపిఐ
న్యూస్‌తెలుగు/వనపర్తి : భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏటా రూ. 12 వేల సాయానికి లబ్ధిదారుల ఎంపికలో మునిసిపాలిటీలో జీవిస్తున్న వ్యవసాయ కూలీలకు అన్యాయం జరుగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయ రాములు విమర్శించారు. గురువారం సిపిఐ ఆఫీసులో సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్ అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. జిల్లా కార్యదర్శి విజయరాములు మాట్లాడారు. ఉపాధి హామీ పథకం లో పనిచేసిన కూలీలలో వంద రోజులు పని చేసిన కూలీలను రూ. 12 000 వేల పథకానికి ఎంపిక చేసేందుకు ప్రభుత్వం పూనుకొందన్నారు. ప్రభుత్వం మున్సిపాలిటీలో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయటం లేదన్నారు. అందువల్ల మున్సిపాలిటీల్లో వ్యవసాయ కూలీపై జీవిస్తున్న భూమిలేని వ్యవసాయ కూలీలకు రూ. 12000 సాయం అందదన్నారు. జిల్లాలో వనపర్తి ఆత్మకూర్ కొత్తకోట పెబ్బేరు అమరచింత మున్సిపాలిటీలు ఉన్నాయన్నారు. మున్సిపాలిటీలలో పట్టణంతోపాటు, గ్రామాలు ఉన్నాయన్నారు. వనపర్తి పట్టణంలో రాజనగరం, శ్రీనివాసపూర్, నాగవరం, నర్సింగయ్య పల్లి, మెట్టుపల్లి తదితర గ్రామాలు ఉన్నాయన్నారు. ఆ గ్రామాల్లో చాలామంది వ్యవసాయ కూలీలని వారికి అన్యాయం జరుగుతుందన్నారు. అందువల్ల వారికి కూడా ఈ పథకం ప్రయోజనం అందాలంటే ఉపాధి హామీ పథకాన్ని ప్రాతిపదికగా తీసుకోకుండా భూమి లేని వ్యవసాయ కూలీలందరికీ రూ. 12 వేలు అందించాలన్నారు. లేదంటే కూలీలను సమీకరించి ఆందోళన చేస్తామన్నారు. కళావతమ్మ శ్రీరాము రమేష్ శ్రీహరి గోపాలకృష్ణ పృథ్వినాదం జయమ్మ శిరీష సత్యనారాయణ చిన్న కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు. (Story : పట్టణ వ్యవసాయ కూలీలకు అన్యాయం : సిపిఐ)