సాలూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక
న్యూస్ తెలుగు/ సాలూరు : ప్రజా సమస్యలన్నీ సకాలంలో పరిష్కరించాలి అధికారులకు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ప్రజల నుంచి అందే అర్జీల్లో ఒక్కటి కూడా పెండింగులో లేకుండా సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాలూరు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పింఛన్లు, ఇంటి స్థలాలు, భూ సమస్యలు, ఉపాధి తదితర అంశాలపై ప్రజలు మొత్తంగా 106 అర్జీలను కలెక్టరుకు అందించి సమస్యలు వివరించారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యకు స్థానికంగానే పరిష్కారం చూపే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని అన్నారు. ప్రతి అర్జీకి నాణ్యమైన పరిష్కారం చూపించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రభుత్వ శాఖల అధికారులు కింది స్థాయి సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే వెంటనే వారి పనితీరు మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. సాలూరు లో విద్యుత్, రెవిన్యూ వంటి విభాగాలకు చెందిన అర్జీలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. కాగా అందిన కొన్ని అర్జీలలో వివరాలు ఇలా ఉన్నాయి.
పాచిపెంట మండలం కోరంగి నుంచి సీముల లచ్చయ్య అర్జీని అందిస్తూ కొండమోసూరు నుంచి అల్లంపాడు వరకు రహదారి నిర్మాణానికి రూ. 2.75 మంజూరైనప్పటికీ ఇంతవరకు పూర్తికాలేదని, దాన్ని పూర్తిచేయాలని కోరారు.
సాలూరు మండలం తోనాం నుంచి పూజారి జగదీశ్వరరావు మాట్లాడుతూ తమ గ్రామంలో భూసర్వే చేపట్టలేదని, కావున రీసర్వే చేయాలని విజ్ఞప్తి చేశారు.
పాచిపెంట ఎస్సీ కాలనీ నుంచి కె.రామారావు అర్జీని ఇస్తూ తమ గ్రామంలోని ఒక ఇంటి వద్ద ఎండు చేపలను విక్రయిస్తున్నారని, దానివల్ల చుట్టు ప్రక్కల దుర్వాసన వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్నందున, సమస్యను పరిష్కరించాలని కోరారు.
సాలూరు మండలం కర్రివలస నుంచి మజ్జి లక్ష్మము తమ పొలానికి వెళ్లాలంటే నలుగురు భూరైతుల పొలాల్లోంచి వెళ్ళాలని, ఇందుకు తగిన దారిని ఇప్పించాలని కోరారు.
పాచిపెంట నుంచి బండి అచ్చెమ్మ తమ అర్జీని కలెక్టరుకు అందజేస్తూ ఎస్సీ కాలనీలో సుమారు 150 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, ఎవరికీ భూములు, ఇళ్ళు గాని లేవని, కావున వాటిని మంజూరుచేయాలని కోరారు.
పాచిపెంట మండలం గడివలసకు చెందిన లెంక దాలినాయుడు మాట్లాడుతూ కర్రివలస గ్రామం సర్వే నెం. 189-2లోని తనకు చెందిన 1.26 ఎకరాల స్థలం వేరే పేరున 1బి ఇచ్చారని, దాన్ని సవరించి తన భూమి ఇప్పించాలని కోరారు.
సాలూరు ఎస్సీ కాలనీ నుంచి పిల్లి అంకమ్మ అర్జీని అందిస్తూ తనకు సొంత ఇళ్ళు, స్థలం గాని లేదని, కావున వాటిని మంజూరు చేయాలని కోరారు.
టిడ్కో గృహాలు మంజూరు అయి బ్యాంక్ రుణాలు చెల్లించాలని నోటీసు లు వస్తున్న ఇప్పటి వరకు ఇళ్లు చూపించలేదని పలువురు తెలిపారు. ఈ సమావేశంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి మరియు పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా వ్యవసాయ అధికారి కె.రాబర్ట్ పాల్, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డా.ఎస్.మన్మధ రావు, డిపిఓ టి.కొండలరావు, జిల్లా సూక్ష్మ నీటిపారుదల అధికారి వి.రాధాకృష్ణ, డ్వామా పీడి కె.రామచంద్ర రావు, జిల్లా మత్స్య శాఖాధికారి వి.తిరుపతయ్య, ఆర్.డబ్ల్యూ.ఎస్ ఈఈ ఒ.ప్రభాకర రావు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎండీ.గయాజుద్దీన్,డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ వై సత్యం నాయుడు, ఇతర శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. (Story : సాలూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక)