అబద్ధాల బ్రహ్మనాయుడు కళ్లకు వాస్తవాలు కనపడవు
మాజీ ఎమ్మెల్యే మక్కెన
న్యూస్ తెలుగు / వినుకొండ : అబద్ధాలు, అరాచకాలకు కేరాఫ్ అడ్రెస్‌గా ఉండే బొల్లా బ్రహ్మనాయుడికి వాస్తవాలు కనిపించకపోవడంలో వింతేమీ లేదని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ వినుకొండ సీనియర్ నాయకుడు మక్కెన మల్లికార్జునరావు ఎద్దేవా చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచింది, భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు, రౌడీయిజం చేసిందెవరో నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసని అగ్రహించారు. విద్యుత్ ఛార్జీల పెంపు పేరిట మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పెట్టిన ప్రెస్‌మీట్‌కు, ధర్నా కు కౌంటర్‌గా శనివారం వినుకొండలో మక్కెన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వాళ్లు చెబుతున్నట్లు వినుకొండలో శాంతిభద్రతలు లేకుంటే బొల్లా వినుకొండ అడుగుపెట్టగలిగే వారా? నిరసన దీక్షలు చేసుకోగలిగేవారా అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.32 వేల కోట్ల భారం మోపిన విషయం మరిచిపోతే ఎలా అని ఎద్దేవా చేశారు. ప్రస్తుత ఛార్జీల పెంపుపైనా అప్పుడే నిర్ణయం తీసుకుని ఎన్నికల కారణంగా వాయిదా వేసి ఓడిపోయాక ధర్నాలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. పైగా ఎన్నికలైన 6నెలలకు బొల్లాకు వినుకొండ గుర్తుకు రావడాన్నీ ప్రజలు గమనిస్తున్నారన్నారు. పింఛన్లు పెంచింది, గుంతలు పూడ్చుతున్నది, పోలవరం, అమరావతి తిరిగి ప్రారంభమైనది బొల్లా కంటికి కనిపించడం లేదా అని చురకలు వేశారు. త్వరలోనే టిడ్కో ఇళ్లు కూడా పూర్తిచేసి పేదలకు ఇవ్వబోతున్నామన్నారు. బొల్లా హయాంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద తెలుగుదేశం కార్యకర్తల తలకాయలు పగులకొట్టారని, నాటి గాయాల మచ్చలు ఇప్పటికీ పోలేదన్నారు. బొల్లా స్థిరాస్తి వ్యాపారం చేశారో లేదో, కొన్న భూములకు ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్లు వేసుకున్నారో లేదా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. జగనన్న కాలనీ పేరిట దోచుకున్నారని, ప్రభుత్వం ద్వారా స్థిరాస్తి వ్యాపారం చేసిన ఏకైక ఎమ్మెల్యే బొల్లానే అని మండిపడ్డారు. బొల్లా వెనకుండి న్యాయవాదులు ఈరోజుకీ కబ్జాలు చేస్తూ కేసులు పెట్టిస్తూ డబ్బులు పోగు చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో బొల్లాకు వల్లభ డెయిరీ, స్థిరాస్తి వ్యాపారాలు ఉన్నాయని, వాటి జోలికి ఎవరైనా వెళ్లారా అని ప్రశ్నించారు. రాయితీలు తీసుకుంటూ చక్కగా వ్యాపారాలు చేసుకుంటునే మళ్లీపై ప్రభుత్వం, చీఫ్ విప్ జీవీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వ్యాపారాలు మరోచోటకు తరలించు కోవడానికే నిందలు మోపుతున్నారని, వాటిని ఖండిస్తున్నామని తెలిపారు. ఏ అధికారులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి దాడి చేశారో బొల్లా చెప్పాలన్నారు. రౌడీషీటర్లు, రౌడీలకు వత్తాసు పలుకుతూ ప్రభుత్వ అధికారులను కొట్టిన వారిని ప్రేరేపిస్తూ ఉంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. బొల్లా నటనకు ఆస్కార్ ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అబద్ధాలు మానుకోవాలని బ్రహ్మనాయుడిని కోరుతున్నామన్నారు. సీనియర్ న్యాయవాది బీసీ నాయకులు పి. సైదారావు మాట్లాడుతూ. ఎంతో రాజకీయ చైతన్యం పొందిన ప్రజలు వైసీపీని గద్దె దింపి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి విద్యుత్ చార్జీలపై ధర్నా చేసే అర్హత లేదని, విద్యుత్ చార్జీలు పెంపు వైసిపి హయాంలోనే అగ్రిమెంట్ జరిగాయి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేసి ఫలితం లేక పోరుబాటంటూ బయటకు వస్తున్నారని సైదారావు అన్నారు. ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం వినుకొండలో అసంపూర్తిగా మిగిలిన టిడ్కో ఇళ్ళను పూర్తి చేయలేదన్నారు. జగనన్న కాలనీ అంటూ వినుకొండ పట్టడానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న బొల్లా బ్రహ్మనాయుడు భూములను అధిక ధరకు ప్రభుత్వానికి అమ్మి సొమ్ము చేసుకున్నది వినుకొండ ప్రజలు మరిచిపోలేదన్నారు. ఇక టిడిపి హయాంలోనే వినుకొండ పైకి ఘాట్ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగిందని, అయితే ప్రభుత్వ మారడంతో ఎమ్మెల్యేగా వచ్చిన బొల్లా బ్రహ్మనాయుడు విరాళాలు ఏమి అక్కర్లేదు అంతా నేనే పూర్తి చేస్తాను అంటూ అరకొరగా పనులు చేసి ఉపాధి హామీ నిధులు బొల్లా భూముల చుట్టూ సిమెంట్ రోడ్లు వేసుకున్నది ప్రత్యక్షంగా కనబడుతున్నదన్నారు. వినుకొండ ఘాట్ రోడ్డు పనులు, ఎన్ఎస్పి స్థలంలో ప్రజా ప్రయోజనాల భవన నిర్మాణాలు ఇంకా తలపెట్టిన అభివృద్ధి పనులు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు త్వరిత గతిన పూర్తి చేస్తారని సైదారావు అన్నారు. ఈ సమావేశంలో టిడిపి పట్టణం అధ్యక్షులు పి. అయూబ్ ఖాన్. నన్నేసా పాల్గొన్నారు. (Story : అబద్ధాల బ్రహ్మనాయుడు కళ్లకు వాస్తవాలు కనపడవు )