క్షేత్ర స్థాయిలో మాదక ద్రవ్యాల నియంత్రణకు ‘సంకల్ప రధం’తో ప్రచారం
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
న్యూస్‌తెలుగు/విజయనగరం : మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలను యువతకు వివరించి, వారిని మాదక ద్రవ్యాల అలవాటుకు దూరం చేసేందుకు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘సంకల్ప రధం’తో ప్రచారం చేపడుతున్నట్లుగా జిలా ఎస్పీ వకుల్ జిందల్ డిసెంబరు 25న తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – యువతతోపాటు డ్రగ్స్ కు అలవాటు పడిన వ్యక్తులు, ప్రజలకు ‘సంకల్పం’ కార్యక్రమాన్ని మరింత చేరువ చేసి, డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సంకల్పించి ప్రత్యేకంగా ‘సంకల్ప రధం’ ను రూపొందించి, రాష్ట్ర హెూంశాఖామాత్యులు చేతులు మీదుగా ఇటీవల ప్రారంభించినట్లుగా తెలిపారు. ఈ సంకల్ప రధంతో ప్రజల్లో మరింత చైతన్యం తీసుకొని వచ్చేందుకు జిల్లా వ్యాప్తంగా రోజూ ఒక మండలాన్ని సందర్శించి, స్థానిక పోలీసు స్టేషను అధికారి, సిబ్బంది సహకారంతో ఉదయం కళాశాలల్లో వాహనాన్ని నిలిపి, విద్యార్ధులకు డ్రగ్స్ వలన కలిగే అనర్థాలను ప్రజలకు వివరించనున్నామన్నారు. అదే విధంగా సాయంత్రం సమయాల్లో అదే మండలంలోని ముఖ్య ప్రాంతంలో వాహనాన్ని నిలిపి, ప్రజలకు, యువతకు మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్ధాలను వివరిస్తూ వారిలో చైతన్యం నింపుతామన్నారు. ఇందుకు సంబంధించి ఒక షెడ్యూలును రూపొందించి, ఏ తేదీన, ఏ మండలానికి సంకల్ప రథం చేరుకుంటుందన్న విషయాన్ని సంబంధిత అధికారులకు ముందుగా సమాచారం అందించడం జరిగిందన్నారు. షెడ్యూలు ప్రకారం స్థానిక పోలీసు అధికారులు, సిబ్బంది ప్రతీ రోజూ ఒక మండలంలోని ఒక కళాశాల, ముఖ్య కూడలిలో వాహనాన్ని నిలిపి, మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలను వీడియోలు ప్రదర్శించి, వివరించనున్నారని తెలిపారు. జనవరి మాసాంతరానికి జిల్లాలోని అన్ని మండలాలను సంకల్ప రధం సందర్శించే విధంగా షెడ్యూలు రూపొందించామని, సంకల్ప రధంతో వీడియోలను ప్రదర్శించి, ప్రజలు, యువతకు రహదారి భద్రత, మహిళల భద్రత, సైబరు మోసాలు పట్ల అవగాహన కల్పించి, వారిని చైతన్యపర్చనున్నట్లుగా జ తెలిపారు.
ప్రశాంతయుతంగా క్రిస్టమస్ వేడుకలు
యేసు క్రీస్తు జననం సందర్భంగా జిల్లాలో నిర్వహించే క్రిస్టమస్ వేడుకల్లో ఎటువంటి అల్లర్లు, మతపరమైన తగాదాలు జరగకుండా ప్రశాంతంగా ముగిసాయని, ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా చర్చిల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ప్రతీ పోలీసు స్టేషను పరిధిలోని క్రిస్టియన్ సోదరులు ప్రార్ధనలు నిర్వహించే చర్చిల వద్ద బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేపట్టడంతోపాటు, సంబంధిత పోలీసు అధికారులు,సిబ్బంది పెట్రోలింగు నిర్వహించారు. క్రిస్టియన్ సోదరులు చర్చిల్లో ప్రార్ధనలు నిర్వహిస్తూ, మతసామరస్యాన్ని పాటిస్తూ,మతాలకు అతీతంగా హిందూ – క్రిస్టియన్ సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సంబంధిత డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు భద్రత ఏర్పాట్లును పర్యవేక్షించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. (Story : క్షేత్ర స్థాయిలో మాదక ద్రవ్యాల నియంత్రణకు ‘సంకల్ప రధం’తో ప్రచారం)