Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ డిపాజిట్లు దక్కవనే ఎన్నికలు బహిష్కరిస్తున్న వైకాపా

డిపాజిట్లు దక్కవనే ఎన్నికలు బహిష్కరిస్తున్న వైకాపా

0

డిపాజిట్లు దక్కవనే ఎన్నికలు బహిష్కరిస్తున్న వైకాపా

గుంటూరులో ఉమ్మడి జిల్లా పట్టభద్రుల ఆత్మీయ సమావేశం
సమావేశంలో పాల్గొన్న కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, చీఫ్ విప్ జీవీ, ప్రజాప్రతినిధులు

న్యూస్ తెలుగు /వినుకొండ : అయిదేళ్లు అధికారంలో చేసిన పాపాలకు ప్రజలు డిపాజిట్లు కూడా ఇవ్వరనే భయంతోనే వైకాపా ఎన్నికలు బహిష్కరిస్తోందని ప్రభుత్వచీఫ్‌విప్‌, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎద్దేవా చేశారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలే కాదు 2029 పోరులోనూ జగన్‌ పార్టీ ఇంటికే పరిమితం కావడం ఖాయమని స్పష్టం చేశారాయన. ఉమ్మడి కృష్ణా – గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మె ల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు తథ్యమన్నారు. గుంటూరు ఏటుకూరు రోడ్డు లోని ఓ కన్వెన్షన్ సెంటర్ ఆదివారం ఉమ్మడి గుంటూరు జిల్లా పట్టభద్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కేంద్రమంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, శాసనసభ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, గళ్లా మాధవి, నజీర్ అహ్మద్, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, బూర్ల రామాంజనేయులు, ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, వేపాడ చిరంజీవిరావు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్‌విప్ జీవీ ఆలపాటి రాజాకు మంత్రిగా చేసిన అనుభవంతో పాటు అనేక రైతు ఉద్యమాలు నడిపారన్నారు. విద్యా సంస్థలు నెలకొల్పి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించారని, అలా ఉద్యోగుల కష్టసుఖాలు తెలిసిన, నిరుద్యోగుల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. లక్షలాదిమందికి ఉద్యోగాలని చెప్పి మోసం చేసినందుకే మొహం చెల్లకనే జగన్ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించారన్నారు‌. తమకు పోటీగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తులు జగన్ రెడ్డి పాలనలో తప్పులపై ఎమ్మెల్సీగా ఉండి ఏనాడైనా మాట్లాడారా? ఎందుకు ప్రశ్నించలేదో పట్టభద్రులంతా ఆలోచన చేయాలన్నారు. విజన్-2047తో స్వర్ణాంధ్రప్రదేశ్ , ఐదేళ్లలో రాష్ట్రానికి రూ.20 లక్షల నుంచి 30 లక్షల కోట్ల పెట్టుబడులు, తద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూట మి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గ్రామాల్లో ఎప్పుడూ లేనిరీతి లో అభివృద్ధి బాటలు వేస్తున్నారని చెప్పారు. మంత్రి లోకేష్ విదేశాలకు వెళ్లి లక్షలాది కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నారని, లక్షలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని తెలిపారు. వైకాపా పాలనలో ఉద్యోగాల్లేవు, పరిశ్రమల‌్లేవు, పెట్టుబడుల్లేవు, ఉపాధి అవకాశాల్లేవని, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదు, ప్రైవేటు సంస్థలను కక్షగట్టి రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారని మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షలాది కోట్ల పెట్టుబడులు, ఉద్యోగాలు కూడా వస్తున్నాయన్నారు. (Story : డిపాజిట్లు దక్కవనే ఎన్నికలు బహిష్కరిస్తున్న వైకాపా)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version