నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయ
స్థల పరిశీలన
స్థల పరిశీలన చేసిన చీఫ్ విప్ జీవీ, ప్రత్తిపాటి, చదలవాడ, భాష్యం ప్రవీణ్, జూలకంటి
న్యూస్‌తెలుగు/వినుకొండ : పల్నాడు జిల్లా పార్టీ కార్యక్రమాలను నరసరావుపేట కేంద్రంగా విస్తృతం చేయాలన్న ఆలోచనలో ఉన్న తెలుగుదేశం అధిష్ఠానం ఆ దిశగా ప్రయత్నాలు వేగిరం చేసింది. నరసరావుపేటలో పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం తెలుగుదేశం ముఖ్య నేతలు శుక్రవారం స్థలాలను పరిశీలించారు. ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, చదలవాడ అరవింద బాబు, భాష్యం ప్రవీణ్ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్, తదితరులు ఈ బృందంలో ఉన్నారు. నరసరావుపేట ఆర్డీవో మధులత, తహసీల్దార్ వేణుతో కలిసి స్థల పరిశీలన చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత పల్నాడుకి ప్రధాన పరిపాలన కేంద్రంగా నరసరావుపేట అవతరించింది. ఆ మేరకు అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలను నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ కొంతకాలంగా భావిస్తోంది. ఆ మేరకు కార్యాలయ నిర్మాణ పనులపై దృష్టిసారించింది. ఇందులో భాగంగానే ఇప్పుడు పార్టీ కార్యాలయం కోసం అనువైన స్థలాలను పరిశీలించారు. రావిపాడు-ఇస్సపాలెం రహదారి సమీపంలోని ఎకరం 47 సెంట్ల భూమి అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. ఆర్డీవో మధులత, తహసీల్దార్ వేణుగోపాల్ రావును అడిగి స్థలం వివరాలు సేకరించారు. పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి తుది నిర్ణయం తీసుకుంటామని నేతలు తెలిపారు. పార్టీ కార్యాలయం కార్యకలాపాలకు అనువుగా అన్నీ సౌకర్యాలను పరిశీలించి తుది నిర్ణయాన్ని ఖరారు చేయనున్నారు. (Story : నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయ స్థల పరిశీలన)