కూటమి ప్రభుత్వంలోనే క్రైస్తవులు మిషనరీ ఆస్తులకు రక్షణ
క్రీస్తు ఆశీర్వాద సంఘం గ్రాండ్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న చీఫ్ విప్ జీవీ, మక్కెన
న్యూస్ తెలుగు/వినుకొండ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వంతోనే క్రైస్తవులు, మిషనరీ ఆస్తులకు అండ, రక్షణ అని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఎలాంటి కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినా ప్రభుత్వం తరఫున సహకారం, చేయూతకు ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. వినుకొండ కల్యాణపురి కాలనీలో క్రీస్తు ఆశీర్వాద సంఘం ఆధ్వర్యంలో శనివారం గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు అతిథులుగా పాల్గొన్నారు. బెల్సి వెస్లి, రెవరెండ్ పాస్టర్ పి.ఫిలిప్ ప్రార్థనలు చేసి ఏసుక్రీస్తు బోధనలు, దైవ సందేశం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జీవీ తన తండ్రి ఏసును ప్రార్థించేవారని, తానూ వినుకొండ లయోల పాఠశాల, క్రిస్టియన్ మిషనరీ స్కూల్‌లో చదువుకున్నాన్నారు. ప్రభువు కృపతో పారిశ్రామికవేత్తగా, ప్రజల మద్దతుతో ఎమ్మెల్యేగా, సీఎం చంద్రబాబు ఆశీస్సులతో చీఫ్ విప్ కావడం జరిగిందన్నారు. తనకు ఏ అధికారం, బాధ్యతలు ఇచ్చినా ప్రజల సంక్షేమం, మన ప్రాంత అభివృద్ధికే ఉపయోగిస్తానని అన్నారు. ప్రతీ ఇంటికి మంచినీళ్లు, పేదలకు ఇళ్లు ఇవ్వాలని, అర్హత ఉన్న ప్రతిఒక్కరికీ పింఛన్ సంకల్పంతో ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ఎప్పుడూ మనం సంతోషంగా ఉంటూ ఆ సంతోషం పక్క వారికి పంచిపెట్టాలన్నదే ఏసు సందేశమన్నారు. తప్పుచేసిన వారిలో పశ్చాత్తా పం ఉండాలని, సత్యం, శాంతి, సమాధానం ముఖ్యమన్నారు. పొరుగువారిని కూడా మనలానే ప్రేమించమనే ఏసుప్రభు చెప్పారన్నారు. అందరు సాటివారికి ప్రేమ, సంతోషం పంచిపెడుతూ ప్రభువు ఆశీస్సులు పొందాలని, ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. నూతనంగా సంస్థను ఏర్పాటు చేసిన ఫిలిప్‌ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ సంస్థ దినదిన ప్రవర్థమానం కావాలని తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు.(Story : కూటమి ప్రభుత్వంలోనే క్రైస్తవులు మిషనరీ ఆస్తులకు రక్షణ )