గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత
న్యూస్ తెలుగు/వనపర్తి : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వనపర్తి ఎమ్మెల్యే టీ మేఘా రెడ్డి అన్నారు. బుధవారం రేవల్లి మండలంలోని శానాయిపల్లి గ్రామంలో రూ. 20లక్షల వ్యయంతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం, గౌరీదేవి పల్లి గ్రామంలో రూ. 8 లక్షల వ్యయం తో నూతనంగా నిర్మించనున్న అంగన్వాడీ భవనానికి శంకుస్థాపన చేశారు. అక్కడే ఉన్న చిన్నారులు, వృద్దులతో ఎమ్మెల్యే ఆప్యాయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేశారు. గౌరీ దేవి పల్లి లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే, రైతులకు సకాలంలో డబ్బులు ఖాతాల్లో పడుతున్నాయా లేదా అని ఆరా తీశారు. అదేవిధంగా, నాగపూర్ గ్రామంలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం రేవల్లి మండల కేంద్రం శివారు వద్ద ఉన్న రైతు వేదిక నుంచి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల వరకు సిసి రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతకుముందు, ఖిల్లా ఘణపురం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన అటవీ శాఖ కార్యాలయం వసతి గృహాలను ప్రారంభించారు. అదేవిధంగా, ఖిల్లా ఘనపురం మండలం దొంతికుంట తండాలో గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ సామూహిక భవన నిర్మాణానికి వనపర్తి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. గ్రామాలలో నూతన గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడి కేంద్రాలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని వివరించారు. డిపిఆర్ఓ సీతారామ్, పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు ఉన్నారు.(Story : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత )