ప్రజల ఆస్తుల రక్షణ ప్రాధాన్యంగా
కూటమి ప్రభుత్వం చర్యలు
న్యూస్ తెలుగు / వినుకొండ : ప్రజల ఆస్తులకు రక్షణ ప్రాధాన్యంగా కూటమి ప్రభుత్వం వరస చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వైకాపా అయిదేళ్ల పాలనలో జరిగిన భూకబ్జాలు, అక్రమాలు సరిచేయడంతో పాటు ఇకపై ఎవరైనా పరాయివాళ్ల భూములపై కన్నేయాలంటేనే భయపడేలా సమగ్ర భూకబ్జాల నియంత్రణ చట్టం కూడా తీసుకుని రావడం జరిగిందన్నారు. భవిష్యత్‌లో భూహక్కుల సమస్యల్లేని రెవెన్యూ నిర్వహణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. బుధవారం ఈ మేరకు వినుకొండ తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైకాపా భూ ఆక్రమణలు, రెవిన్యూ రికార్డుల్ని అస్తవ్యస్తం చేసింద ని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డిసెంబర్ 6 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, రెవెన్యూ అధికారులే స్వయంగా గ్రామాలకు వస్తున్నారని, ఏమైనా సమస్యలు ఉంటే ఫిర్యాదు చేయాలని, వచ్చిన ఫిర్యాదులపై 45 రోజుల నిర్దుష్ట కాలవ్యవధిలో మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు. వైసీపీ పాలనలో అడ్డుఅదుపు లేకుండా సాగిన భూ దందాలపై వేలకు వేలు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. రికార్డుల ట్యాంపరింగ్, ఆన్‌లైన్‌లో వివరాల మార్పు, దొంగపత్రాలు సృష్టించి హక్కుదారుల్ని రోడ్డున పడేయడం, తాతల నాటి ఆస్తులూ కాజేయం వంటి ఎన్నో దారుణాలకు పాల్పడ్డారన్నారు. వాటిని సక్రమం చేసుకునేందుకు తెచ్చిన దుర్మార్గపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను సీఎం చంద్రబాబు రద్దు చేశారన్నారు. దాంతోబాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల రక్షణ కోసం దేశంలోనే మొదటిసారి సమగ్ర భూకబ్జాల నియంత్రణ చట్టం తీసుకువచ్చారని తెలిపారు. తెదేపా సభ్యత్వ నమోదులో వినుకొండ చరిత్ర సృష్టిస్తోందని రాష్ట్రంలో 4వ స్థానంలో నిలవడం గర్వంగా ఉందన్నారు. ఈ రోజు సాయంత్రానికి సభ్యత్వాలు 84వేలు దాటుతున్నాయన్నారు……. . ఈ సందర్భంగానే పారా లక్ష్మయ్యకు రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్ ఛైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. పారా లక్ష్మయ్యను ఘనంగా సన్మానించారు. వినుకొండ సహా పల్నాడు జిల్లాలో పశు సంపద ఎక్కువని, గేదెలు, గొర్రెలు, మేకలు, ఇతర పశు సంపద ఇక్కడ ఉందన్నారు. దానిపై పారా లక్ష్మయ్యకు అపారమైన అనుభవం ఉందని, వారి అనుభవంతో పశుసంవర్ధక శాఖలో గొప్ప మార్పులు తీసుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పశు సంపద పెరిగితే రాష్ట్ర ఆర్థిక ప్రగతికి మేలు జరుగుతుందన్నారు. ఆ దిశగా చీఫ్ విప్‌గా తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఆయనకు ఉంటాయన్నారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, లగడపాటి వెంకట్రావు, పీవీ సురేష్‌బాబు, పెమ్మసాని నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రజల ఆస్తుల రక్షణ ప్రాధాన్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు)