సౌర విద్యుత్ ఒప్పందాల్లో అవినీతిపై సీఐడీ విచారణ జరిపించాలి
విశాలాంధ్ర/వినుకొండ : సౌర విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి వెలుగుచూసిన అవినీతి ఆరోపణలపై సీఐడీ విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతామన్నారు అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. సౌరవిద్యుత్ పేరిట వేలకోట్ల అవినీతి, దోపిడీలో అడ్డంగా దొరికిన దొంగ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అని, ఆ నిజాలన్నీ నిగ్గుతేల్చి, దోషులకు సరైన శిక్షలు పడాలంటే సరైన దర్యాప్తు జరగాల్సిందే అన్నారు. చేసిన నిర్వాకాలు చాలక మళ్లీ ప్రెస్‌మీట్‌లు పెట్టి బొంకాలని చూస్తున్నారని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు జీవీ. నాడు అధికారం చేతుల్లో ఉంది కదా అని కేంద్ర విద్యుత్‌చట్టాన్ని తుంగలోకి తొక్కి, బిడ్డింగ్ రూల్స్‌కు విరుద్ధంగా బరితెగించి దోపిడీకి పాల్పడ్డారని, ఇప్పుడు దొరికి పోయేసరికి ఏమీ ఎరగనట్లు మాట్లాడుతున్నా రని చురకలు వేశారు. రాష్ట్రంలో అరాచక పాలనతో అన్ని వ్యవస్థల్ని విధ్వం చేసింది కాక రూ. 10 లక్షల కోట్లు అప్పులచేసి ఇప్పుడొచ్చి సంపదసృష్టించామంటే ప్రజలు నవ్వుతున్నారన్నారు జీవీ. జగన్ సంపదసృష్టి మాట దేవుడెరుగు గానీ అతడి రివర్స్, అవినీతి పరిపాలనతో ఏపీ 5ఏళ్లలో 50ఏళ్లు వెనక్కుపోయిందని వాపోయారు. ఇప్పుడు జగన్ చెబుతున్నట్లు సౌర ఒప్పం దాల్లో అతడి గ్యాంగ్ ఏ తప్పుచేయకుంటే వారి అవినీతిపై అమెరికాలో కేసు ఎందుకు పెడతారని సూటిగా ప్రశ్నించారు. నాటి రాష్ట్ర విద్యుత్ మంత్రికే తెలియకుండా అర్థరాత్రి ఒప్పందం ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో కూడా జగన్ సమాధానం చెప్పాలన్నారు జీవీ. సెకీతో సౌర విద్యుత్ ఒప్పందానికి సంబంధించి వచ్చిన ప్రతిపాదనలపై ఒక్కరోజులో క్యాబినెట్ ఆమోదం ఎలా పొందారు? ఏం చర్చించారు? అనే విషయాలు కూడా ప్రజలకే వివరించాలన్నారు. కేవలం కమీషన్ల కక్కుర్తి, తన ఒక్కడి ధనదాహం కోసం, స్వార్థం కోసం 25ఏళ్ల పాటు రాష్ట్రప్రజల ప్రయోజనాలను జగన్ తాకట్టుపెట్టారని తూర్పార బట్టారు. అందుకే సెకీ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సీఐడీ విచారణకు ఆదేశించాలని కోరారు.(Story : సౌర విద్యుత్ ఒప్పందాల్లో అవినీతిపై సీఐడీ విచారణ జరిపించాలి )