సమస్యలపై ప్రజావినతులకు తెదేపా కేంద్ర కార్యాలయానికి పోటెత్తిన అర్జీదారులు
*’ప్రజా దర్బార్’లో వినతులు స్వీకరించిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
న్యూస్ తెలుగు/వినుకొండ : సమస్యలపై ప్రజావినతులు అందించేందుకు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయానికి బాధితులు పోటెత్తారు. గురువారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, తెదేపా నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు సమస్యలను చీఫ్ విప్ జీవీ దృష్టికి తీసుకెళ్లారు. అర్జీలు స్వీకరించి విచారించి చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్నా గత ఐదేళ్లుగా ప్రభుత్వ పథకాలు దక్కనివారు, వైసీపీ దౌర్జన్యాలు, అరాచకాలతో నష్టపోయిన బాధితులు, వివిధ తీవ్ర సమస్యలతో సతమతమవుతున్న వారు అర్జీలు ఇచ్చేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. వారి బాధలను శ్రద్ధగా ఆలకించి తగు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అర్జీలను సంబంధిత ప్రభుత్వ శాఖలకు పంపి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే జిల్లాస్థాయి అధికారులతో జీవీ ఆంజనేయులు ఫోన్లో మాట్లాడి బాధితుల సమస్యల పరిష్కారం దిశగా సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు. వినతులు స్వీకరించడంతో పాటు వారితో చీఫ్ విప్ జీవీ ఆత్మీయంగా మాట్లాడారు. వివిధ రకాల సమస్యలతో వచ్చిన బాధితులతో పార్టీ కార్యాలయం కిక్కిరిసిపోయింది. వైసీపీ దౌర్జన్యాలు, భూకబ్జాలు, రెవెన్యూ సమస్యలు, పింఛన్లు, నివేశ స్థలాలు, తాగునీరు, రహదారుల నిర్మాణం, తదితర సమస్యలపై అర్జీలు అధికంగా వచ్చాయి.(Story : సమస్యలపై ప్రజావినతులకు తెదేపా కేంద్ర కార్యాలయానికి పోటెత్తిన అర్జీదారులు )