గురుకులాల ప్రతిష్టను కాంగ్రెస్ భ్రష్టు పట్టించింది
న్యూస్‌తెలుగు/ వనపర్తి :గురుకులాల ప్రతిష్టను కాంగ్రెస్ భ్రష్టు పట్టించింది అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురై 20 రోజులకు పైగా చికిత్స పొంది గురుకుల విద్యార్థిని శైలజ మరణించిన మరుసటి రోజే.. మళ్లీ ఉమ్మడి పాలమూరులో ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాగనూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఫుడ్‌పాయిజన్ కావడంతో 30 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురి కావడానికి ప్రభుత్వ పర్యవేక్షణ లోపమే కారణమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న ఇప్పటికీ విద్యాశాఖ, హోం శాఖ, మున్సిపల్ శాఖ మంత్రుల నియామకానికి దిక్కేలేదు అని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వంలోని అనేక శాఖల మీద పర్యవేక్షణ లేకపోవడం మూలంగానే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని అన్నారు. ఏడాది పాలనలో గురుకుల విద్యను దిగజార్చారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ పాలనలో ఎవరెస్టు శిఖరం ఎత్తుగా ఉన్న గురుకులాల ప్రతిష్టను కాంగ్రెస్ భ్రష్టు పట్టించిందని అన్నారు. ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక గురుకుల పాఠశాల, వసతీగృహంలో ఫుడ్ పాయిజన్ కేసులు వెలుగుచూస్తున్నా ప్రభుత్వం కనీసం సమీక్షించడం లేదని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. గిరిజన విద్యార్థి శైలజ మరణం ముమ్మాటికి ప్రభుత్వం హత్యే అని ఆరోపించారు. గురుకులాల్లో జరుగుతున్న సంఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌చేశారు. మధ్యాహ్నం భోజనం తిని అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన విద్యార్థులకు నాణ్యమైన చికిత్స అందించాలన్నారు. (Story : గురుకులాల ప్రతిష్టను కాంగ్రెస్ భ్రష్టు పట్టించింది)