ప్రణాళిక బద్ధంగా నిర్మాణాలుంటే భవిష్యత్తుకు బంగారు బాటే
డీటీసీపీ ఆర్‌జే.విద్యుల్లత
న్యూస్ తెలుగు/విజయవాడ : ప్రణాళికాబద్ధంగా నిర్మాణాలుంటే భవిష్యత్తు తరాలకు బంగారు బాటేనని అందుకు పట్టణ ప్రణాళిక ఉద్యోగుల కృషి ఎనలేనిదని డీటీసీపీ ఆర్‌జే విద్యుల్లత అన్నారు. ప్రపంచ పట్టణ ప్రణాళిక దినోత్సవం సందర్భంగా శుక్రవారం మంగళగిరి డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పట్టణ ప్రణాళిక సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు అబ్దుల్ సత్తార్, కార్యదర్శి మోహన్‌బాబు ఆధ్వర్యంలో రాష్ట్ర పట్టణ ప్రణాళిక అదనపు సంచాలకులు శ్రీనివాసులు, జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళిక అధికారి ప్రభాకర్‌రావు, రాష్ట్ర పట్టణ, గ్రామ సంచాలకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశ, రాష్ట్ర అభివృద్ధిలో పట్టణ ప్రణాళిక శాఖ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. పట్టణ ప్రణాళిక మౌలిక సదుపాయాల కల్పనలో, పట్టణాలు ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చెందుకు భాద్యతగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. చిన్న చిన్న నగరాలే మెట్రో నగరాలుగా రూపాంతరం చెందుతూ మహానగరాలుగా తీర్చిదిద్దడంలో పట్టణ ప్రణాళిక అధికారులు సిబ్బంది ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. పట్టణ ప్రణాళిక సిబ్బంది, పట్టణ ప్రణాళిక ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకు వెళ్ళి ప్రణాళిక బద్ధంగా గృహనిర్మాణాలు చేపట్టాలన్నారు. మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో, మహానగరాల్లో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అనేక ఒత్తిడికిలోనై విధులు నిర్వహిస్తున్నారని అర కోర సిబ్బందితో తీవ్రమైన పని భారంతో భవిష్యత్తు తరాల అభివృద్ధి కోసం శ్రమిస్తున్న పట్టణ ప్రణాళిక ఉద్యోగులను ఆమె అభినందించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పట్టణాలు, నగరాలు అభివృద్ధికి, రహదారుల విస్తరణతో పాటు అనేక నగరాల రూపకల్పనలో పట్టణ ప్రణాళిక అధికారుల కృషి ఎనలేనిదని, సిబ్బంది కొరతను ప్రభుత్వం తీర్చాలని, అర్హులైన వారందరికీ పదోన్నతులు కల్పించి పట్టణ ప్రణాళిక విభాగాన్ని మరింత పటిష్టం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రీజనల్ అధ్యక్షులు బేగ్, ట్రెజరర్ కృష్ణ, రాజ్యలక్ష్మి, ఏపీఓ పీ.నాయుడు, టీపీఓ సీఆర్డిఏ శైలజ, సంజీవ్ రత్న కుమార్ పాల్గొన్నారు. (Story : ప్రణాళిక బద్ధంగా నిర్మాణాలుంటే భవిష్యత్తుకు బంగారు బాటే)