ఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా అమలు చేయాలి
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్
న్యూస్ తెలుగు/విజయనగరం : జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమీషను నోటిఫికేషను జారీ చేయడంతో ఎన్నికలను సజావుగా, శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల కమీషను ఆదేశాలు, ప్రవర్తనా నియమావళి ఖచ్చితంగా అమలయ్యే విధంగా సంబంధిత పోలీసు అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. జిల్లాలో పని చేస్తున్న పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ జూమ్ కాన్ఫరెన్సు నిర్వహించి, ఎన్నికల నిర్వహణలో చేపట్టాల్సిన చర్యలు గురించి పోలీసు అధికారులకు దిశా నిర్ధేశం చేసారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – రాష్ట్ర ఎన్నికల కమీషను స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషను జారీ చేయడంతో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజా ప్రతినిధులు నిర్వహించే సమావేశాలకు హాజరు కావద్దని, వారు హాజరయ్యే సమావేశాలు, సందర్శనలకు సైరన్ మ్రోగిస్తూ పైలట్ గా వెళ్ళవద్దన్నారు. ఎన్నికల సమావేశాలు, ర్యాలీలకు మరియు ప్రచారంకు వినియోగించే లౌడు స్పీకర్లుకు సంబంధిత అధికారుల నుండి తప్పనిసరిగా ముందస్తు అనుమతులు తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషను అధికారుల సహకారంతో తొలగించాలన్నారు. అంతేకాకుండా, బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటై ఉన్న రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా చూడాలని, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు నగదు, మద్యం వంటి అక్రమ రవాణ జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అతిక్రమించిన వారిపై దాడులు నిర్వహించేందుకు ఇప్పటికే ప్రత్యేకంగా ఎం.సి.సి. టీంలను, ఫైయింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. లైసెన్సు కలిగిన తుపాకులను ఎన్నికల ముగిసేంత వరకు డిపాజిట్ అయ్యే విధంగా చూడాలన్నారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు సృష్టించేందుకు అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి, బైండోవరు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, డిఎస్పీలు ఎం.శ్రీనివాసరావు, పి.శ్రీనివాసరావు, ఎస్.రాఘవులు, ఎస్బీ సిఐ ఎవి లీలారావు, ఆర్.వి.ఆర్.కే.చౌది, పలువురు సిఐలు, ఎస్ఐలు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.(Storyఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా అమలు చేయాలి)