బత్తలపల్లి మండలాన్ని కరవు మండలాల జాబితాలో చేర్చాలి
ఇన్ ఛార్జి మంత్రి సత్యప్రసాద్ కు పరిటాల శ్రీరామ్ విజ్ఞప్తి
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలాన్ని కరువు మండలముగా జాబితాలో చేర్చాలని ఇన్చార్జి మంత్రి సత్య ప్రసాద్కు పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పుట్టపర్తిలోని సాయి ఆరామ్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఎన్డీఏ ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో శ్రీరామ్, సునీత పాల్గొన్నారు. ముందుగా మంత్రి అనగాని సత్యప్రసాద్, టిటిడి బోర్డు సభ్యులుగా నియమింపబడిన మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజుని శాలువాతో సత్కరించారు. అనంతరం సొంత వ్యవసాయ క్షేత్రంలో పండిన సీతాఫలం పండ్లను అందజేశారు. ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీ, జనసేన, బీజేపీ నాయకులకు సీతాఫలం పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా ధర్మవరం నియోజకవర్గంలోని సమస్యల్ని ఇన్ ఛార్జి మంత్రి సత్యప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలోని మూడు మండలాలను కరవు మండలాల జాబితాలో చేర్చారని.. కానీ నియోజకవర్గంలో మొత్తం అన్ని మండలాల్లోనూ తీవ్ర కరవు పరిస్థితులు ఉన్నాయి అని ముఖ్యంగా ఈ ఖరీఫ్ లో జులై, సెప్టెంబర్ మాసాల్లో తీవ్ర వర్షాభావం ఉంది అని,దీని వలన వేరుసెనగ, కంది ఇతర పంటలన్నీ ఎండిపోవడం జరిగిందన్నారు. ఊడలు దిగే సమయంలో వర్షం రాకపోవడంతో రైతులు వేసిన పంట పూర్తిగా ఎండిపోయిందన్నారు. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉందన్నారు. కావున నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలాన్ని కూడా కరవు మండలాల జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గత నెల 21వ తేదీ అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాల వలన రైతులు, చేనేతలు ,సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టం నష్టపోయారని వారికి పరిహారాన్ని అందించాలని వారు తెలిపారు. (Story : బత్తలపల్లి మండలాన్ని కరవు మండలాల జాబితాలో చేర్చాలి)