వరి కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా పారదర్శకంగా జరగాలి
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి వరి నిర్దేశించిన మిల్లు లేదా గోదాము కు మాత్రమే వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
న్యూస్ తెలుగు/వనపర్తి : వానాకాలం వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం కలక్టర్ ఛాంబర్ లో వరి కొనుగోలు పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక నిర్దిష్టమైన గుర్తింపు సంఖ్య ఇవ్వాలని అదే విధంగా కొనుగోలు కేంద్రంలో వచ్చిన ధాన్యపు బస్తాల పై గుర్తింపు సంఖ్య ముద్ర వేయాలని సూచించారు. పౌర సరఫరాల శాఖ ద్వారా కొనుగోలు కేంద్రం నుండి కేటాయించిన మిల్లు కు గాని గోదాము కు గాని మాత్రమే ధాన్యం తరలించాలని అలా కాకుండా కొనుగోలు కేంద్రం నుండి తమకు ఇష్టం వచ్చిన మిల్లుకు ధాన్యం తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.ప్రతి కొనుగోలు కేంద్రంలో కనీస మౌలిక వసతులు ఉండాలని తమ యంత్రాలు, తూకం యంత్రాలు అందుబాటులో ఉండాలని సూచించారు. దొడ్డు రకం ధాన్యం తమ శాతం 17, సన్న రకం అయితే 14 శాతం తేమ కలిగి ఉండాలని సూచించారు. పంట కోతల ప్రారంభం కాగానే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై అధికారి విశ్వనాథ్, వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్, మార్కెటింగ్ శాఖ అధికారి స్వరణ్ సింగ్, డి.యం. ఇర్ఫాన్, డి.పి యం అరుణ తదితరులు పాల్గొన్నారు.(Story: వరి కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా పారదర్శకంగా జరగాలి)