అవినీతి రహిత సమాజం కోసం ఏఐవైఎఫ్ కృషి చేస్తుంది..
ఏఐవైఎఫ్ పల్నాడు జిల్లా కన్వీనర్ సిపిఐ సుభాని
న్యూస్‌తెలుగు/ వినుకొండ : అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ పోరాటాలకు పదును పెట్టాలని ఏఐవైఎఫ్ పల్నాడు జిల్లా కన్వీనర్ సిపిఐ సుభాని పిలుపునిచ్చారు. వినుకొండ నియోజకవర్గం ఏఐవైఎఫ్ నిర్మాణ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ తెల్లదొరలను గడగడలాడించి తరిమికొట్టిన చరిత్ర ఆంధ్ర రాష్ట్ర యువజన సమాఖ్య కు ఉన్నదని, 1959 మే మూడో తేదీన ఆవిర్భవించిన అఖిల భారత యువజన సమాఖ్య 18 సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించాలని ఉద్యమించి సాధించిన చరిత్ర ఏఐవైఎఫ్ ది అని కొనియాడారు. అవినీతి అంతం ఏఐవైఎఫ్ పంతం అనే నినాదంతో అవినీతి మీద ఉద్యమిస్తూన్న ఏకైక యువజన సంఘం ఏఐవైఎఫ్ అని అన్నారు. భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ కోసం ఏఐవైఎఫ్ పోరాటం చేస్తున్నదని, దీనికోసం గత సంవత్సరం దేశంలోని యువతను కలుపుకొని ఢిల్లీ పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల చేయకుండా, ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్లకు కారు చౌకగా అమ్ముతున్నదనీ విమర్శించారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా ప్రైవేటు పరం చేయడానికి సిద్ధమైందని, ఆనాడు విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం విద్యార్థులు ప్రాణత్యాగం చేశారని, లెఫ్ట్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవి త్యాగం చేశారని, వారి త్యాగాన్ని స్మరించుకొని వారి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నదని వారు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నూతన పరిశ్రమలను ప్రతి జిల్లాకు తీసుకువచ్చి యువతకు ఉపాధి చేకూరేలా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జంగాల చైతన్య మాట్లాడుతూ వాలంటీర్ల కోసం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు రూపొందించడం జరుగుతుందని,దీనిలో భాగంగానే నవంబర్ 9వ తేదీన విజయవాడలో రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ల సమస్యల మీద సదస్సు నిర్వహించడం జరుగుతున్నదని ఆ సదస్సుకు అత్యధిక సంఖ్యలో వాలంటీర్లు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన తెలిపారు. అనంతరం ఏఐవైఎఫ్ నూతన కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా దండబోయిన వెంకట అజయ్, కార్యదర్శిగా తంగిరాల రమేష్, ఉపాధ్యక్షులుగా నల్లపూతుల శ్రీను, దారి వేముల మరియ బాబు, సహాయ కార్యదర్శులుగా మర్రిపూడి అంజమ్మ, షేక్ సుభాని, కోశాధికారిగా పిడతల పున్నమ్మ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. బూదాల మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్, ఏరియా కార్యదర్శి బుదాల శ్రీనివాసరావు, ఏఐవైఎఫ్ మాజీ నాయకులు పటాన్ లాల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. (Story : అవినీతి రహిత సమాజం కోసం ఏఐవైఎఫ్ కృషి చేస్తుంది..)