షర్మిలమ్మా.. ఆశకు కూడా హద్దు ఉండాలి
ఆనాడే వైయస్సార్‌గారు కూతురుకు ఆస్తులు పంచారు
అయినా అన్న సంపాదనలో భాగస్వామ్యం కోరడం తగునా?
జగన్ తన వ్యాపారాలు చక్కగా చేసుకున్నారు.. ఎదిగారు
షర్మిల వ్యాపారాలు చేసుకోలేకపోతే జగన్ బాధ్యుడవుతాడా?
సహృదయంతో జగన్ తన ఆస్తిలో వాటా ఇస్తున్నారు
అయినా హక్కుగా డిమాండ్ చేయడం సమంజసమేనా?
షేర్లు బదలాయించుకుని, బహిరంగ లేఖలు రాయొచ్చా?
చంద్రబాబు తన తోబుట్టువులకు ఆస్తులేమైనా రాసిచ్చాడా?
అయినా వారు బయటపడ్డారా? ఇలా రోడ్డెక్కారా?
వాళ్లని చూసైనా సరే షర్మిలమ్మ సంస్కారం నేర్చుకోవాలి
అన్‌స్టాపబుల్ షోలో చంద్రబాబు మాటలు ఆశ్చర్యకరం
ఆయన ప్రతి మాట పచ్చి అబద్ధం. సానుభూతి డ్రామా
కడపలో వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌వీ సతీష్‌రెడ్డి ప్రెస్‌మీట్
న్యూస్‌తెలుగు/కడప: ఆ«శకు కూడా హద్దు ఉంటుందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిలమ్మ తెలుసుకోవాలని వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌వీ సతీష్‌రెడ్డి హితవు చెప్పారు. తండ్రి స్వయంగా ఆస్తులు పంచి ఇచ్చినా, అన్న ఆస్తిలో భాగస్వామ్యం కోరడం సబబేనా అని ఆయన ప్రశ్నించారు. తండ్రి ఇచ్చిన ఆస్తిని షర్మిల పూర్తిగా దుర్వినియోగం చేసిందని, వ్యాపారాలు సరిగ్గా చేసుకోలేకపోవడం, మరోవైపు తెలంగాణలో పార్టీ పెట్టి చేతులు కాల్చుకోవడంతో తీవ్రంగా నష్టపోయిన షర్మిల, అన్న స్వార్జితంలో వాటా కోసం రోడ్డెక్కడం ఏ మాత్రం సమంజసం కాదని స్పష్టం చేశారు.
చెల్లెలుపై ప్రేమతో జగన్, ఆస్తులు రాసిచ్చినా హక్కుగా కోరడం, ఈ విధంగా వ్యవహరించడం సరికాదని తేల్చి చెప్పారు.
ఒక సోదరిగా షర్మిలకు ఏం కావాలన్నా సరే జగన్‌ను నేరుగా లేదా శ్రేయోభిలాషుల ద్వారా అడగాలి తప్ప, ఇలా అక్రమంగా షేర్లు బదలాయించుకోవడం, బహిరంగ లేఖలు రాసి అన్నను బజారుకు ఈడ్చడం సరికాదని సతీష్‌రెడ్డి తెలిపారు. 10 ఏళ్లలో రూ.200 కోట్లు ఇవ్వడమే కాకుండా, ఆస్తిలో 40 శాతం ఇచ్చినా కూడా, జగన్‌ను ఈ విధంగా టార్గెట్ చేయడాన్ని ప్రజలు కూడా తప్పుపడుతున్నారని చెప్పారు.
ఎన్నికల హామీలు అమలు చేయని చంద్రబాబు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ.. ఇలా షర్మిలను పావుగా వాడుకుని కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నారని వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఆక్షేపించారు. అదే చంద్రబాబు తన లక్షల కోట్ల ఆస్తిలో తన తోబుట్టువులకు ఏమన్నా ఇచ్చారా? అనేది షర్మిల తెలుసుకోవాలని హితవు చెప్పారు. అయినా ఏనాడూ నోరు మెదపని వారి సంస్కారాన్ని చూసి షర్మిల నేర్చుకోవాలని సూచించారు.
ఇక అన్‌స్టాపబుల్ షోలో మాట్లాడిన చంద్రబాబు, తాను 50 రోజులు జైల్లో ఉంటే ప్రపంచం తలకిందులైనట్లు చెబుతున్నారని, మరి అక్రమంగా కేసులు బనాయించి జగన్‌ను 16 నెలలు జైల్లో ఉంచడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. స్కిల్‌స్కామ్‌లో షెల్ కంపెనీల ద్వారా రూ.371 కోట్లు దోచుకుని, ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయినా, తానే తప్పు చేయలేదంటూ బుకాయించడం, రాజకీయాల్లో తనంత సచ్చీలురు లేరని చెప్పుకోవడం కేవలం ఒక్క చంద్రబాబుకే సాధ్యమని అన్నారు. తానెప్పుడూ కక్షపూరిత రాజకీయాలు చేయలేదని చంద్రబాబు అన్నారని.. కానీ వాస్తవానికి కక్షపూరిత రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని అభివర్ణించారు. ఆ షోలో చంద్రబాబు ప్రతి మాట పచ్చి అబద్ధమన్న సతీష్‌రెడ్డి, అదంతా సానుభూతి కోసం బావ, బావమరిది చేసిన డ్రామా అని వివరించారు. (Story : షర్మిలమ్మా.. ఆశకు కూడా హద్దు ఉండాలి)