గిరిజన ప్రాంతాలలో మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలి
న్యూస్ తెలుగు/ సాలూరు : గిరిజన ప్రాంతాలలో మౌలిక సదుపాయాలైన విద్య. వైద్యం రోడ్లు. సాగునీరు. తాగునీరు సమస్యలపై అధికారులు దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖమంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. శనివారం ఆమె ఆధ్వర్యంలో పార్వతీపురం కలెక్టర్ కార్యాలయంలో అన్నీ డిపార్ట్‌మెంట్‌ల ముఖ్య అధికారులతో రివ్యూ మీటింగ్ జరిగింది ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, మన్యంలో జిల్లా అధికారులు ప్రజా ఫిర్యాదులపై చక్కగా స్పందిస్తున్నందుకు అధికారులను అభినందించారు.ప్రతి సోమవారం మండలాల్లో ఫిర్యాదు స్వీకరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దీని ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకోవచ్చని తెలిపారు. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో ప్రధాన సమస్యలైన విద్య, వైద్యం, రహదారులు, త్రాగునీరు, సాగు నీరు వాటిని గుర్తించి, వీటిపై అధికారులు దృష్టి పెట్టాలని మంత్రి ఆదేశించారు.ప్రత్యేకంగా కొందరు కొండ ప్రాంతాల్లో నివసించే గ్రామాలలో కనీసం తాగు నీరుకూడా అందుబాటులో లేకపోవడంతో, వెంటనే త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.243 హాస్టళ్లలో టాయిలెట్స్ నిర్మాణం పనులు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. హాస్టళ్లలో ప్రతి విద్యార్థికి ఒక ట్రంక్ పెట్టె, దుప్పట్లు, ఇతర అవసరమైన వస్తువులు నేరుగా అందించాల్సిందిగా సూచించారు.
సాలూరు 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి సీఎం 4 కోట్ల నిధులు విడుదల చేసినట్లు మంత్రి వివరించారు. సాలూరు, కురుపాం, పాలకొండ ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని, 10 ఇళ్లున్న గ్రామాలకు కూడా తగిన నీటి సౌకర్యం ఉండేలా చూడాలని ఆదేశించారు.ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న గిరిజనులకు ఆసుపత్రుల్లో తగిన వైద్యం అందేలా డాక్టర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి ఆసుపత్రిలో డాక్టర్ అందుబాటులో ఉండాలని, మందులు కూడా అందుబాటులో ఉంచాలని, ఎక్కడైనా మందుల కొరత లేదా బయట కొనుగోలు చేయాలని సూచిస్తే ఉపేక్షించేది లేదని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సబ్ కలెక్టర్ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. (Story : గిరిజన ప్రాంతాలలో మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలి)