సివిల్స్ శిక్షణకు ఎంపికైన విద్యార్థినులకు మంత్రి సత్య కుమార్ రూ.5 లక్షల విరాళం
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ధర్మవరం ప్రాంతం నుండి ఎంపికైన 28 మంది విద్యార్థినుల వసతి కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ రూ. 5 లక్షల విరాళాన్ని లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీకి అందజేశారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైతం సివిల్ సర్వీసెస్ కు ఎంపిక కావాలనే ఉద్దేశంతో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సంస్కృతి స్వచ్ఛంద సంస్థ తరఫున ఢిల్లీకి చెందిన లక్ష్మయ్య ఐఏఎస్ అకాడమీ ద్వారా గత ఆదివారం ధర్మవరంలో సివిల్ సర్వీసెస్ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా అకాడమీ వారు నిర్వహించిన అర్హత పరీక్షలో ధర్మవరం ప్రాంతం నుండి 28 మంది విద్యార్థినిలు ఉచిత శిక్షణకు ఎంపికయ్యారు. వీరికి రెండు సంవత్సరాల పాటు హైదరాబాదులో ఉచిత వసతి తో కూడిన శిక్షణ అందించడం జరుగుతుంది. మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ తన నియోజకవర్గం నుండి ఉచిత శిక్షణకు ఎంపికైన విద్యార్థులు కోసం సంస్కృతి స్వచ్ఛంద సంస్థ తరఫున రూ. 5 లక్షలు అందజేసి విద్యార్థినులను ప్రోత్సహించారు. శిక్షణకు ఎంపికైన వారందరూ తీవ్రంగా శ్రమించి సివిల్ సర్వీసెస్ కు ఎంపికవ్వాలని, ఐఏఎస్ ఉద్యోగాలు సాధించి ధర్మవరం పేరును జాతీయస్థాయిలో చాటి చెప్పాలని ఆయన ఆకాంక్షించారు. ధర్మవరం ప్రాంత విద్యార్థుల భవిష్యత్తు కోసం తాను కట్టుబడి ఉన్నానని, రాబోవు కాలంలో విద్యార్థులందరికీ ఉద్యోగ అవకాశాలు లభించేలా కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. (Story : సివిల్స్ శిక్షణకు ఎంపికైన విద్యార్థినులకు మంత్రి సత్య కుమార్ రూ.5 లక్షల విరాళం)