సనాతనధర్మం జోలికొచ్చిన వారంతా అడ్రస్ లేకుండా పోయారు
శాంతి ఆశ్రమంలో సకల సాంస్కృతిక కళాకారుల గురువుల ఆత్మీయ సమ్మేళనం
ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న జీవీ, మక్కెన, డాక్టర్ గజల్ శ్రీనివాస్
న్యూస్ తెలుగు /వినుకొండ : దేశంలో సనాతనధర్మం జోలికొచ్చిన వారంతా అడ్రస్ లేకుండా పోయారని, అందుకు రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న పరిణామాలే నిదర్శనమని తెలుగుదేశం పార్టీ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఆలయాలు, అర్చకులపై దాడులతో పాటు సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని కుట్ర చేసిన అయిదేళ్ల జగన్ పాలనకు ప్రజలే సరైన గుణపాఠం చెప్పడమే అందుకు నిదర్శనమన్నారు. వినుకొండ పట్టణ సమీపంలో ఉన్న శాంతి ఆశ్రమంలో మంగళవారం సకల సాంస్కృతిక కళాకారుల గురువుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. శాంతి ఆశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, డాక్టర్ గజల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ. ప్రపంచదేశాలకు భారతీయ సనాతన ధర్మం ఆదర్శనీయమన్నారు. టెలిస్కోప్ లేనప్పుడే మనదేశంలో గ్రహగతులను లెక్కగట్టి చెప్పారన్నారు. సనాతన ధర్మం ద్వారా చెప్పిన విషయాలే అలా అనేకమంది శాస్త్రవేత్తలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని తెలిపారు. పొరుగువారిని ప్రేమించమని, ఇతరులకు సహాయం చేయమని సనాతన ధర్మంలోనే చెప్పారన్నారు. అన్నిమతాల్నిను గౌరవించడం కూడా సనాతన ధర్మమేనన్నారు. అందుకే మన ధర్మాన్ని ఎంత ముందుకు తీసుకెళ్తే అంతగా అభివృద్ధిలో ముందుంటామన్నారు. శాంతి, సంతోషాలకు భారతదేశం, ఆంధ్రప్రదేశ్, పల్నాడు నిలయం అవుతుందని ఆకాంక్షించారు. హిమాలయ గురూజీ శాంతి ఆశ్రమం ఏర్పాటు చేసినప్పటి నుంచి వినుకొండ యజ్ఞాలు, యాగాలకు నిలయమైందన్నారు. సుమారు 352 దినుసులతో యజ్ఞాలను నిర్వహించారన్నారు. దసరా సందర్భంగా రాజశ్యామల యాగం చాలా గొప్పగా నిర్వహించడం ప్రత్యేక విశేషమన్నా రు ఎమ్మెల్యే జీవీ. ఈ ప్రాంతం నుంచి శాంతి, సంతోషాలు దేశమంతా వ్యాప్తి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. గడిచిన అయిదేళ్ల వైకాపా పాలనలో దేవాలయాలపై దాడులు జరిగినా, రథాలను తగులబెట్టినా పట్టించుకోకుండా దుర్మార్గంగా వ్యవహరించిన వారంతా అడ్రస్ లేకుండా పోవడం దేవుడి లీలగానేని అభిప్రాయపడ్డారు. వైకాపా హయాంలో వందల కోట్ల విలువైన దేవాలయ ఆస్తులను కబ్జా చేశారని మండిపడ్డారు. ఇదే సందర్భంగా ఆలయాల్లో ఉండే అర్చకులకు జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్న ఎమ్మెల్యే జీవీ చంద్రబాబు వచ్చిన తర్వాతే మసీదుల్లో పనిచేసే ఇమామ్‌లు, మౌజమ్‌లకు గౌరవ వేతనాలు ఇచ్చారని గుర్తుచేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తే అందరూ సంతోషంగా ఉంటారన్నారు. కులాలు, మతాల మధ్య ఐక్యత ఉండాలని కోరారు. హైందవ ధర్మపరిరక్షణే ధ్యేయంగా… సనాతన ధర్మప్రచారమే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్లి పది కాలాలపాటు భావితరాలకు కూడా ఒక మంచి అభివృద్ధిని, శాంతిని అందించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కొనిజేటి నాగ శ్రీను రాయల్, బిజెపి నాయకులు మేడం రమేష్, పలువురు గురూజీలు, కళాకారులు పాల్గొన్నారు. (Story : సనాతనధర్మం జోలికొచ్చిన వారంతా అడ్రస్ లేకుండా పోయారు)