పోలీసుల సేవలు వెలకట్టలేనివి
న్యూస్‌తెలుగు/వనపర్తి : సమాజ భద్రత కోసం ప్రాణాలను లెక్క చేయకుండా, అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన పోలీస్ సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ అమరవీరుల స్తుపానికి పుష్పాలతో శ్రద్ధాంజలి ఘటించారు. అమరులైన పోలీసుల గౌరవార్థం మౌనం పాటించారు.అమరవీరుల పోలీస్ కుటుంబ సభ్యులకు కలెక్టర్, ఎస్పీలు సన్మానం చేసి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం వ్యక్తగత జీవితాన్ని పక్కన పెట్టి, అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలు వెలకట్టలేనివని అన్నారు. విధినిర్వహణలో అసువులు బాసిన పోలీసుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పోలీస్ అమరవీరులకు శిరస్సు వంచి నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు. జిల్లా ఎస్పీ గిరిధర్ మాట్లాడుతూ దేశ భద్రత కోసం దేశ సరిహద్దుల్లో సైన్యం ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపలా కాస్తుంటే అంతర్గతంగా దేశంలో పోలీస్ లు శాంతిభద్రతలు కాపాడుతున్నారని కొనియాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ లు తమ ప్రాణాలను సైతం లెక్క చేయడం లేదని తెలిపారు. గత సంవత్సర కాలంలో శాంతిభద్రతలు కాపాడుతూ దాదాపు 250 కి పైగా పోలీసులు ప్రాణాలు కోల్పోయారని వారందరికీ నేడు శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రామదాసు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఏఆర్ అదనపు డిఎస్పీ వీరా రెడ్డి, ఎస్సైలు, సీఐలు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. (Story : పోలీసుల సేవలు వెలకట్టలేనివి)