ఈ ప్రభుత్వంలో రైతులకు కరెంట్ కష్టాలు ఉండకూడదు
ప్రాధాన్యత వారీగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు మంజూరు చేయాలి
సిబ్బంది కొరత ఉండకూడదు.. లో ఓల్టేజ్ సమస్య రాకూడదు
శ్రీ సత్యసాయి జిల్లా విద్యుత్ శాఖ అధికారులకు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచన.
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : గత ప్రభుత్వంలో లాగా.. ఇప్పుడు రైతులకు విద్యుత్ కష్టాలతో పంటలు ఎండిపోవడం వంటి పరిస్థితులు ఉండకూడదని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా విద్యుత్ శాఖ ఎస్.ఈగా బదిలీపై వచ్చిన సురేంద్ర, ఈఈ శివరాం ఎమ్మెల్యే సునీతతో మర్యాదపూర్వకంగా భేటి అయ్యారు. అనంతపురం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీతతో పాటు ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్ ని కలిశారు. ఈ సందర్భంగా రాప్తాడు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్ సమస్యల గురించి చర్చించారు. ప్రధానంగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల కోసం సంవత్సరాల తరబడి రైతులు ఎదురు చూస్తున్నారన్నారు. ప్రధాన్యత వారిగా ట్రాన్స్ ఫార్మర్లు వచ్చేలా చూడాలన్నారు. అలాగే చాలా లో ఓల్టేజ్ సమస్య ఉందని.. దీనిని నివారించాలన్నారు. సిబ్బంది కొరత కారణంగా రైతులు, ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉందన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని సునీత సూచించారు. కొన్ని గ్రామాల్లో విద్యుత్ వైర్లు చాలా కిందకు ఉన్నాయని..దీని వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని.. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి వాటిని సరిచేయాలన్నారు. ఎమ్మెల్యే సునీత చెప్పిన అంశాల మీద క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తామని.. సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ఎస్ఈ సురేంద్ర, ఈఈ శివరాం తెలిపారు.(Story:ఈ ప్రభుత్వంలో రైతులకు కరెంట్ కష్టాలు ఉండకూడదు)