భారీ వర్ష సూచనతో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
వర్షం నీరు రోడ్లపై నిలవకుండా డిసిల్టింగ్ పనులు ప్రారంభించండి
న్యూస్ తెలుగు/విజయవాడ : భారీ వర్ష సూచనల నేపథ్యంలో నగరపాలక సంస్థ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది బ్లాక్ స్పాట్లను గుర్తించి ముందుగానే డీసిల్టింగ్ ప్రక్రియను మొదలు పెట్టాలన్నారు. 8వ డివిజన్ సిద్ధార్థ నగర్‌లో కమిషనర్ సోమవారం పర్యటించి అక్కడ నుండి జోనల్ కమిషనర్లు, శాఖాధిపతులు, సచివాలయం సిబ్బంది, స్పెషల్ ఆఫీసర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షం సూచనలున్నందున అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ ప్రతి సచివాలయం పరిధిలోని ప్రజలందరికీ సమాచారాన్ని చేరవేయటంతో పాటు ప్రతి సచివాలయం పరిధిలో ఉన్న చాకింగ్ పాయింట్లను గుర్తించి వెంటనే అక్కడున్న ప్లాస్టిక్‌ను, ఫ్లోటింగ్ గార్బేజ్, డీజిల్టింగ్ చేసి వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షం పడక ముందే, వర్షపు నీరు నిలువ ఉండే ప్రాంతాలను గుర్తించి డీజిల్టింగ్ ప్రక్రియను చేపట్టాలన్నారు. వర్షం పడిన వెంటనే సిబ్బంది అప్రమత్తమై వర్షపు నీరు నిలువకుండా చూడాలని, అధికారులు, జోనల్ కమిషనర్లు వారి వారి ప్రాంతాల్లో దగ్గరుండి పర్యవేక్షించాలన్నారు. బుడమేరు వరదల్లో, దసరా ఉత్సవాల్లో సిబ్బంది పనితీరును ప్రసంశించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ శుభం నొక్వల్, కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం పాల్గొన్నారు. (Story : భారీ వర్ష సూచనతో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి)