పోలీసులున్నది ప్రజల కోసమే అనే నమ్మకం పెంచాలి
ట్రాఫిక్ సమస్య, సీసీ కెమెరాల ఏర్పాటు, శాంతిభద్రతల పరిరక్షణపై జీవీ సమీక్ష
న్యూస్ తెలుగు /వినుకొండ : పోలీసులు ఉన్నది ప్రజల రక్షణ కోసమే అన్న నమ్మకాన్ని పెంచాలని, ఫ్రెండ్లీ, సమర్థ పోలీసింగ్‌కు వినుకొండను నమూనాగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. గంజాయి రవాణా, విక్రయం, వినియోగంపై సీరియస్‌గా దృష్టి సారించాలని, పాతనేరస్థులపై గట్టి నిఘా ఉంచాలని పోలీసు అధికారులకు సూచించారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. వినుకొండ నియోజకవర్గంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ పటిష్టం చేసి నేరాలు తగ్గించడంతో పాటు తీవ్రనేరాల విషయంలో ఆ ఆలోచన రావాలి అంటేనే భయపడేలా కఠిన చర్యలు ఉండాలని జీవి అన్నారు. వినుకొండ పట్టణంలో ట్రాఫిక్ సమస్య, సీసీ కెమెరాల ఏర్పాటు, శాంతిభద్రతల పరిరక్షణపై పట్టణ, గ్రామీణ సీఐలు శోభన్‌బాబు, ప్రభాకర్‌తో శుక్రవారం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సమీక్షించారు. ఈ సందర్భంగా శాంతిభద్రతలకు సంబంధించి అన్ని విషయాలు చర్చించిన ఆయన దొంగతనాలు, దోపిడీలు నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పనితీరు నేరుగా ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుందని గుర్తు పెట్టుకోవాలన్నారు. మరీ ముఖ్యంగా మహిళల రక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా చర్యలు ఉండాలని స్పష్టం చేశారు. ఆ విషయంలో రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాల నిఘా ప్రయోజనకరంగా ఉంటుందన్నారు ఎమ్మెల్యే జీవీ. ఇదే సమయంలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ ఆధునికీకరణపై కూడా అధికారులతో చర్చించారు. ప్రజల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తునే తోపుడు బండ్లు, చిరు వ్యాపారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్ అంటే ప్రజల్లో ఉన్న భయం పోవాలని మాకోసం పోలీసులున్నారనే భావన సామాన్యుల్లో కల్పించడమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. శాంతిభద్రతల పరంగా సున్నితమైన, సమస్యాత్మకమైన ప్రాంతాల్లో గస్తీ, సీసీ కెమెరాల ఏర్పాటును మరింత పెంచాలన్నారు. అందకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సహాయసహకారాలు కావాలన్న అందేలా చూసే బాధ్యత తమదన్నారు. పోలీసుల గౌరవం పెరిగేలా, ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా సమర్థంగా పనిచేయాలని సూచించారు. కీలక ప్రదేశాలు, రహదారుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వీటి వినియోగం వల్ల కేసుల ఛేదన సులభతరం అవుతుందన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా జనం ముందుకు వచ్చేలా ప్రోత్సహించాలని సూచించారు. (Story : పోలీసులున్నది ప్రజల కోసమే అనే నమ్మకం పెంచాలి)