UA-35385725-1 UA-35385725-1

హుస్నాబాద్ మార్కెట్‌ పీఠం ఎవరికో..?

హుస్నాబాద్ మార్కెట్‌ పీఠం ఎవరికో..?

బడా నేతల మెప్పు కోసం ఆశావహులు యత్నం

– సీనియర్ నాయకులకే ప్రాధాన్యం

– నువ్వా-నేనా అంటున్న రెడ్డి వర్సెస్ రెడ్డి, మరోవైపు జంగపెల్లి..!

న్యూస్ తెలుగు/ సిద్దిపేట జిల్లా ప్రతినిధి (నారదాసు ఈశ్వర్): హుస్నాబాద్ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి దక్కించుకునేందుకు కాంగ్రెస్‌ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలో పలుకుబడి, బడా నేతల అండదండలతో ఇప్పటికే కొందరు నాయకులు పైరవీలు ప్రారంభించారు. ప్రభుత్వం నామినేటెడ్‌ పదవులను రద్దు చేసిన విషయం విధితమే. దాంతో సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్‌ కమిటీ నూతన కార్యవర్గం కోసం తిరిగి నోటిఫికేషన్‌ జారీ చేయటంతో పలువురు నాయకులు తమ దృష్టిని మార్కెట్‌ కమిటీ వైపు కేంద్రీకరించారు. హుస్నాబాద్,అక్కన్నపేట,చిగురుమామిడి మండలాలను కలుపుతూ ఏర్పాటు చేసిన హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కొత్త సారథి ఎవరనే విషయమై సర్వత్రా చర్చ కొనసాగుతోంది. మార్కెట్‌ కమిటీ ఏర్పాటైనప్పటి నుంచి ప్రతీ మండలానికి ఒకసారి చైర్మన్‌ పదవి ప్రాప్తించే అవకాశం కల్పించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో వరుసగా రెండు దఫాలు చైర్మన్‌ పదవి హుస్నాబాద్,అక్కన్నపేట మండలాలకు చెందిన నాయకులకు అవకాశం ఇవ్వగా, ఈసారి వేరే మండలాలకు చెందినవారికి ఇవ్వనున్నట్లు సీనియర్‌ నాయకులు యోచిస్తున్నందున.. చిగురుమామిడి మండలానికి చెందిన నేతలు కూడా చైర్మన్‌ పదవిపై ఆశలు పెంచుకున్నారు. ప్రస్తుతం ఈ సారి చిగురుమామిడి మండలానికి మార్కెట్ ఛైర్మన్ ఇస్తూనే, బీసీ నాయకుడికి వైస్ చైర్మన్ అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. చైర్మన్‌తో పాటు 18మంది డైరెక్టర్ల నియామకం పట్ల పార్టీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు. ఏది ఏమైనా చైర్మన్‌ కోసం రెండు మండలాల నాయకులు గట్టిగా యత్నిస్తుండగా.. వైస్‌ చైర్మన్‌, డైరెక్టర్‌ పదవుల కోసం మిగతా మండలాల నాయకులు యత్నిస్తున్నారు. మొదట్లో మార్కెట్‌ కమిటీ పరిధిలోని అన్ని మండలాల నుంచి పోటీ ఉన్నప్పటికీ పార్టీ అధిష్టానం రైతులు అధికంగా ఉన్న మండలాలకే ప్రాధాన్యత కల్పిస్తామని తేల్చి చెప్పటంతో మిగతా మండలాలకు చెందిన నేతలు చైర్మన్‌ పదవిపై ఆశలు వదులుకుంటున్నారు.

ముగ్గురి మధ్యే గట్టి పోటీ!

కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం చిగురుమామిడి మండలాధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ ముత్యాల సంజీవరెడ్డి, అక్కన్నపేట మండలాధ్యక్షుడు జంగపెళ్లి అయిలయ్యల మధ్య గట్టి పోటీ కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ ముగ్గురు నాయకులు చైర్మన్‌ పదవి దక్కించుకునేందుకు పార్టీ పెద్దల మెప్పుకోసం పెద్దఎత్తున పైరవీలు చేస్తున్నారు. పార్టీ నియోజకవర్గ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్ణయం కీలకంగా మారింది. వారి మెప్పు కోసం చైర్మన్‌ పదవి కొరకు పోటీ పడుతున్న నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డితో పాటు స్థానిక సీనియర్ నేతలు సంజీవరెడ్డి కి మద్దతు పలుకుతుండగా, మరో వైపు అయిలయ్య రెండు మార్లు ఎంపీటీసీ ,ఒకమారు సర్పంచ్ గా పార్టీ తరపున తన సేవలను గుర్తించి తనకే పొన్నం మద్దతు ఇస్తున్నట్లు జోరుగా ప్రచారం కొనసాగుతోంది. కాగా, పోటీ పడుతున్న ఇద్దరు నేతలూ రెడ్డి వర్గానికి చెందిన వారు కావటంతో వారిని సముదాయించి ఒకరికి చైర్మన్‌ పదవి ఇవ్వటానికి పార్టీ పెద్దలు యత్నిస్తున్నారు. ఆ ఇద్దరు కూడా ఒప్పుకోని పరిస్థితుల్లో పార్టీ పెద్దలు ప్రత్యామ్నాయంగా బీసీ సామాజిక వర్గ నాయకుడికి చైర్మన్‌ పదవి అంటగట్టినా ఆశ్చర్యపోనక్కరలేదని కొందరు నాయకులు బాహాటంగానే అంటున్నారు. నేతల మధ్య పెరిగిన పోటీ తత్వంతో పార్టీ పెద్దలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాల్సిందే. (Story : హుస్నాబాద్ మార్కెట్‌ పీఠం ఎవరికో..?)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1