అన్ని సదుపాయాలతో పూర్తి అయిన పోషక పునరావాస కేంద్రం
జిల్లాలోని స్యామ్ మ్యామ్ పిల్లల ఆరోగ్య పరిరక్షణకు సద్వినియోగం చేసుకోవాలి
ఆసుపత్రిలో అత్యవసర శస్త్ర చికిత్సల తో పాటు వైద్య విద్యార్థుల శిక్షణకు ఉపయోగ పడేవిధంగా
అత్యాధునిక పరికరాలతో ఆధునిక శస్త్ర చికిత్స గదిని ఏర్పాటు చేయాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి ;నర్సింగాయ పల్లి వద్ద ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని వసతులు, వైద్య సిబ్బందితో పోషక పునరావాస కేంద్రం (NRC) ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో ఎత్తుకు తగ్గ బరువు, వయసుకి తగ్గ ఎదుగుదల లేని పిల్లలకు ఉచిత వైద్య సేవలు పొందాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. 5 పడకల వసతితో అన్ని మౌలిక వసతులతో ఏర్పాటుచేసిన ఎన్.ఆర్.సి కేంద్రంలో చిన్న పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం, వయసుకు తగ్గ ఎదుగుదల లేకపోవడం, రక్త హీనత వంటి రుగ్మతలతో బాధపడుతున్న పిల్లలను ఎన్.ఆర్.సి సెంటరులో చేర్చి పిల్లలకు ఉచితంగా పౌష్టికాహారం, నిపుణులైన వైద్యులతో వైద్య సేవలు పొందాలని సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం ఉదయం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రితో పాటు నర్సింగాయ పల్లి వద్ద గల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ముందుగా స్థానిక ప్రభుత్వ వైద్యశాలను సందర్శించిన కలెక్టర్ ఆసుపత్రిలో అవుట్ పేషంట్ విభాగం, లేబర్ వార్డు, పురుషుల వైద్య వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడారు. వైద్యుల ద్వారా అందిస్తున్న వైద్య సేవల పై ఆరా తీశారు. అన్ని వసతులతో శస్త్ర చికిత్స ఆపరేషన్ ధియేటర్ ను సిద్ధం చేయాలని అత్యవసర సేవల కొరకు ఆసుపత్రికి వచ్చే రోగులకు శస్త్ర చికిత్సలు చేయడంతో పాటు వైద్య కళాశాల విద్యార్థుల శిక్షణకు ఉపయోగపడే విధంగా రూపొందించాలని సూచించారు. అదేవిధంగా ట్రామ కేర్ యూనిట్ సైతం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మరమ్మతు, మార్పు చేర్పులు పనులు త్వరగా పూర్తి చేయాలని టి.ఎస్.యం. ఐ.డి సి. సహాయ ఇంజనీరు శివ ను ఆదేశించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ రంగారావు, చిన్న పిల్లల వైద్యులు డా. చంద్రమోహన్, ఎ. ఈ. శివ, వైద్య సిబ్బంది తదితరులు కలక్టర్ వెంట ఉన్నారు. (Story : అన్ని సదుపాయాలతో పూర్తి అయిన పోషక పునరావాస కేంద్రం)