గర్జించిన మహిళాలోకం
న్యూస్‌తెలుగు/విజయనగరం: వాజీ చానల్, మహిళా గర్జన కమిటీ సంయుక్తంగా నిర్వహించిన మహిళా గర్జన కార్యక్రమం విజయవంతమైంది. మహిళలపై జరుగుతున్న దాడులను ప్రతిఘటిస్తూ తమ నినాదాలతో మహిళా లోకం గర్జించింది. ర్యాలీని వాజీ చానల్ మేనేజింగ్ డైరక్టర్ గణపతినీడి శ్రీనివాసరావు ప్రారంభించి మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను తీవ్రమైన సమస్యగా గుర్తించి , సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం బహుముఖమైన చొరవ తీసుకోవాలన్నారు. లైంగిక దాడుల కేసులు సత్వర విచారణ జరగాలని, దోషులకు శీఘ్రంగా కఠిన శిక్షలు పడాలని, అలా చేసినప్పుడే చట్టమన్నా, ప్రభుత్వమన్నా ప్రజల్లో భయం ఏర్పడుతుందని అన్నారు. కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా గర్జన వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్న వాజీ చానల్ కృషి అభినందనీయమని పేర్కొన్నారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ శిక్షలు కఠినంగా ఉండాలని, అప్పుడే తప్పులు చేయడానికి భయపడతారని, కానీ మన సమాజంలో అటువంటి పరిస్థితులు లేవని అన్నారు. బాధితులకు సత్వరమే న్యాయం జరగవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మహిళలకు గౌరవం ఇంటి వద్ద నుండే ప్రారంభం కావాలని అన్నారు.
ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాపుగంటి ప్రకాష్, ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్ పర్సన్ గోటేటి హిమబిందు మాట్లాడుతూ చట్టాన్ని అమలు జరిపే యంత్రాంగానికి ఎప్పటికప్పుడు తగిన శిక్షణ ఇవ్వాలని, ప్రజలను జాగృతంచేయడానికి విస్తృతమైన ప్రచారాలను నిర్వహించాలని, ప్రజలకు చట్టపరమైన హక్కుల గురించి వివరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థలు, మహిళా గర్జన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. (Story : గర్జించిన మహిళాలోకం)