సెల్ఫీ పాయింట్స్‌తో ప్రజాదరణ
నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
న్యూస్ తెలుగు/విజయవాడ : ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో స్వచ్ఛత గురించి ప్రజలకు మరింత అవగాహన కల్పించేలా సెల్ఫీ పాయింట్స్ ఏర్పాటుపై ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం మారీస్ స్టెల్లా కాలేజ్ వద్ద షాపర్స్ స్టాప్ మాల్, గురునానక్ కాలనీలోని ఉషోదయ సూపర్ మార్కెట్, పంటకాలువ రోడ్డు వద్ద ఉన్న నారాయణస్కూల్, వన్‌టౌన్ గాంధీజీ హైస్కూల్, నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద సెల్ఫీ స్టాండ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సెల్ఫీ స్టాండ్‌ల ద్వారా ప్రజలు సెల్ఫీ దిగడమే కాకుండా స్వచ్ఛత వైపు వారి మద్దతుని చాటి చెబుతున్నారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటంతో పాటు నగరాన్ని పరిశుభ్రత వైపు ముందడుగులు వేస్తూ స్వచ్ఛ సర్వేక్షన్‌లో ప్రథమ స్థానం కైవసం చేసుకునేలా వారి మద్దతును ప్రకటిస్తున్నట్లు తెలిపారు. 4వ డివిజన్, శ్రీనివాసనగర్, బ్యాంక్ కాలనీలో ప్రజలకు స్వచ్ఛత హీసేవ కార్యక్రమం గురించి అవగాహన కల్పించేందుకు కళా జాతర బృందం చే ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. పరిసరాల పరిశుభ్రత, సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధం, స్వచ్ఛత, కాలుష్యాన్ని తగ్గించటం, ప్రజలు చేపట్లాల్సిన పనులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం లాంటి తదితర అంశాలపై నాటకం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇనస్పెక్టర్ జానకిరామ్, శానిటరీ సెక్రటరీలు, స్వచ్ఛ సర్వేక్షన్ సిబ్బంది పాల్గొన్నారు. (Story : సెల్ఫీ పాయింట్స్‌తో ప్రజాదరణ)