వెంకన్న ముందు నిలబడే ధైర్యం లేక తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్..
లడ్డు ప్రసాదం కలిపి పాపం ఊరికే పోదు
భక్తుల మనోభావాలను దెబ్బతీసిన జగన్ కు శిక్ష తప్పదు
రామలింగేశ్వర స్వామి ని మోసం చేసిన బొల్లా
ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ చేశారు కాబట్టే సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ముందు నిలబడే ధైర్యం లేక తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. స్థానిక నరసరావుపేట రోడ్డులోని శనేశ్వర ఆలయంలో శనివారం ఉదయం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, లీలావతి దంపతులు హోమం నిర్వహించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐదేళ్ల జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనలో పట్టిన శనిని ప్రజలు వదిలించారని, మిగిలిన మలినాలు పోవటానికి శనేశ్వరాలయంలో పూజలు చేశామన్నారు. లడ్డు ప్రసాదంలో కల్తీ చేసిన జగన్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పకుండా కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయటం దుర్మార్గమన్నారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చి వెళ్లమంటే జగన్ రెడ్డి తిరస్కరించటం సబబు కాదన్నారు. సనాత సాంప్రదాయాలను ఎవరైనా గౌరవించాల్సిందేనన్నారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డికి ఆ దేవుడు శిక్షిస్తాడని, తప్పు మీద తప్పు చేస్తున్న జగన్కు శిక్ష తప్పదని హెచ్చరించారు. దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదని, ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎస్సీ ఎస్టీలపై తప్పుడు కేసులు బనాయించడమే కాక, దాడులు చేయించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. చర్చి పాస్టర్లకు జీతాలు ఇస్తానని జగన్ మోసం చేశాడని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవస్థలను నాశనం చేసి లక్షల కోట్లు దోచుకున్న జగన్ రెడ్డి అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మారిస్తే నేడు ఎన్డీఏ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు వాటన్నింటి పునరుద్ధరణ చేస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నారని తెలిపారు. సనాతన ధర్మాలను పాటించకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ పవిత్రమైన లడ్డుని కల్తీ చేసి అవినీతికి పాల్పడిన జగన్ రెడ్డి లాగానే వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు శ్రీ రామలింగేశ్వర స్వామిని మోసం చేశాడని ఎద్దేవా చేశారు. రాజకీయ స్వార్థం కోసం, వ్యక్తిగత ఆస్తుల విలువలను పెంచుకుని రియల్ ఎస్టేట్ చేసుకునేందుకు దేవుడి పేరుతో ప్రజలను మోసం చేశాడని, పుర ప్రజల మౌలిక వస్తువులకు ఖర్చు చేయాల్సిన కోట్లాది రూపాయలు తీసుకువెళ్లి తన ఆస్తులు చుట్టూ సిసి రోడ్లు వేసుకొని బొల్లా ప్రజలను మోసం చేశాడని విమర్శించారు. లడ్డు కల్తీని సమర్థిస్తూ నేడు బ్రహ్మనాయుడు ఆలయాల్లో పూజలు చేయడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, జనసేన నాయకులు నిశంకర్రావు శ్రీనివాసరావు, టిడిపి జనసేన బిజెపి నాయకులు పాల్గొన్నారు. (Story : వెంకన్న ముందు నిలబడే ధైర్యం లేక తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్..)