పర్యాటక ప్రాంతాల గురించి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లాలోని విశేషమైన, పర్యాటక ప్రాంతాల గురించి ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పర్యాటక అధికారి ఆధ్వర్యంలో వనపర్తి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పర్యాటక దినోత్సవం ప్రాధాన్యత పై విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించగా మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు అదనపు కలక్టర్ ప్రశంసా పత్రంతో పాటు బహుమతులు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో శ్రీరంగాపూర్, పామాపురం, చంద్రగడ్, పానగల్ కోట, ఖిల్లా ఘనపూర్ కోటలు ఉన్నాయని, అప్పుడప్పుడు వాటిని సందర్శించి ఆహ్లాదం, ఆరోగ్యాన్ని పొందవచ్చు అన్నారు. సోషల్ మీడియా ద్వారా, స్నేహితులకు చెప్పడం ద్వారా ఒక ప్రాంతం ప్రాచుర్యం పొందుతుందన్నారు. అదేవిధంగా జిల్లాలో పారిశుధ్యం పై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని, తమ ఇంటి ఆవరణ, పరిసరాల్లో చెత్త వేయకుండా చెత్త బుట్టలోనే చెత్త వేసే విధంగా చూడాలని విద్యార్థులను సూచించారు. పరిసరాల పరిశుభ్రత పర్యాటక రంగంతో ముడిపడి ఉంటుందని అన్నారు. ప్రాంతం పరిశుభ్రంగా ఉన్నప్పుడే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లా టూరిజం, జిల్లా పౌర సంబంధాల అధికారి పి. సీతారం, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సుధీర్ రెడ్డి, కస్తూరిబా విద్యాలయ ఎస్. ఒ లోహిత, ఉపాద్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. (Story : పర్యాటక ప్రాంతాల గురించి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది)