జిల్లాలోని యువతను విద్యతో పాటు అన్ని రంగాల్లో నైపుణ్యాభివృద్ధి సాధించేందుకు తనవంతు కృషి
న్యూస్‌తెలుగు/ వనపర్తి : జిల్లాలోని యువతను విద్యతో పాటు అన్ని రంగాల్లో నైపుణ్యాభివృద్ధి సాధించేందుకు తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. జిల్లెల చిన్నా రెడ్డి అన్నారు.జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో గురువారం బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, అదనపు కలక్టర్ సంచిత్ గంగ్వార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లాలోని 15 నుండి 29 సంవత్సరాల వయసు కలిగిన యువతకు సాంస్కృతిక, జానపద నృత్యం, జానపద గీతాపన, వ్యాస రచన, చిత్రలేఖనం, ఉపన్యాస, కవిత్వం వంటి రంగాల్లో పోటీలు నిర్వహించి మొదటి, ద్వితీయ స్థానంలో వచ్చిన కళాకారులకు బహుమతులు ఇవ్వడంతో పాటు రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. ఈ సందర్భంగా స్వామి వివేకానందుని చిత్ర పటానికి పూల మాలతో నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు వీర నారి చాకలి ఐలమ్మ జయంతి ఉన్నదని మహిళలు ఆమెను స్ఫూర్తి గా తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతి కార్యక్రమాలలో సైతం రాణించాలని సూచించారు. జిల్లాలో క్రీడలను ప్రోత్సహించేందుకు ఇప్పుడు ఉన్న ఇండోర్ స్టేడియాన్ని రెనోవేశన్ చేయించేందుకు కృషి చేస్తానని చెప్పారు. విద్యార్థులు పోటీ ప్రపంచంలో ఉన్నారని, పోటీని తట్టుకొని విజయాన్ని అందుకునే విధంగా జిల్లాలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదనపు కలక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదువుకొనే కాకుండా క్రీడలు, సాంస్కృతిక కళల్లో నైపుణ్యం సాధించాలని సూచించారు.అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫెర్ కార్యక్రమాలను తిలకించారు. జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సుధీర్ రెడ్డి, జిల్లా పౌర సంబంధాల అధికారి సీతారం, జిల్లా ఇంటర్మిడియట్ నోడల్ అధికారి అంజయ్య, పి.ఈ.టి. సురేందర్ రెడ్డి, మాజీ జడ్పీటిసి రాజేంద్ర ప్రసాద్, జిల్లా సీనియర్ కళాకారుడు డప్పు స్వామి విద్యార్థులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.(Story:జిల్లాలోని యువతను విద్యతో పాటు అన్ని రంగాల్లో నైపుణ్యాభివృద్ధి సాధించేందుకు తనవంతు కృషి)