గ్రామసభలో వచ్చిన సమస్యలను పరిష్కరిస్తాం
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా): గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామసభల్లో ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చే సమస్యలను తక్షణ పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కార్యాల సిబ్బంది పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధర్మవరం మండలం, నేలకోట తాండ పంచాయతీ లో గ్రామసభ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కార్యాలయ సిబ్బంది పాల్గొని ప్రజల నుండి సమస్యలను స్వీకరించారు. గ్రామస్థులకు ఇంకుడు గుంతల గురించి అవగాహన కల్పించారు. గ్రామస్తులు తమ సమస్యలను సిబ్బందికి తెలియజేస్తూ గ్రామంలో మురుగు కాలువలు,సిసి రోడ్ల అవసరం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా కార్యాల సిబ్బంది మాట్లాడుతూ మంత్రివర్యులు సత్యకుమార్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కారం చేసేందుకు ఆయన కృషి చేస్తున్నారని చెప్పారు. అనంతరం
ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి పాఠశాలలోని మౌలిక వసతుల గురించి తెలుసుకున్నారు. అంగన్వాడి సెంటర్ కోసం గ్రామంలో కేటాయించిన మూడు సెంట్ల స్థలాన్ని పలువురు వ్యక్తులు కబ్జా చేశారని గ్రామస్తులు ఫిర్యాదు చేయగా, సిబ్బంది కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడ అంగన్వాడి కేంద్రం నిర్మించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ సూర్యనారాయణ, సచివాలయం సెక్రెటరీ చంద్రిక, టెక్నికల్ ఆఫీసర్ భాస్కర,అశోక్, మంత్రి కార్యాలయ ఇన్చార్జ్ హరీష్, బిజెపి నాయకులు డోలా రాజారెడ్డి, డి చెర్లోపల్లి నారాయణస్వామి, ఎర్రజోడు లోకేష్, జింక రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు. (Story: గ్రామసభలో వచ్చిన సమస్యలను పరిష్కరిస్తాం)