మడ్డువలస జలాశయం శివారు ఆయకట్టు రైతులు ఆందోళన
న్యూస్‌తెలుగు/విజయనగరం : ఖరీఫ్ కాలం ముగుస్తున్నా ఇంత వరకు మడ్డువలస జలాశయంకి చెందిన చుక్క నీరైనా తమ గ్రామాలకు అందలేదని 12 గ్రామాలకు చెందిన రైతులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. జిల్లాలో సంతకవిటి మండలం లోని సిరిపురం, చిన్నసిరిపురం, శేషాద్రిపురం, బలరాంపేట, అప్పలగ్రహారం, మంతిన, బూరాడపేట, శివకాలపేట, గెడ్డవలసఅగ్రహారం, గోకర్ణపల్లె తదితర గ్రామాలకు చెందిన మండ్డువలస జలాశయం శివారు గ్రామాల రైతులు తమ నిరసన స్వరం వినిపించారు. ఒకొక్క రైతు వేలాది రూపాయిల మదుపులతో వరి, మొక్కజొన్న, చెరుకు తదితర వాణిజ్య పంటలు వర్షాధారమైన నీరుతో సాగు చేయటం ప్రారంభిస్తే ఇంత వరకు మడ్డువలస నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మడ్డువలస జలాశయం కాలువల్లో సంవత్సరాల తరబడి పూడికతీత లేకపోవటం, కాలువ అంతటా పెద్ద ఎత్తున మొక్కలు చెట్లుగా మారిపోవటంతో తమ పంట పొలాలకు శాపంగా మారిందని రైతులు స్పష్టం చేశారు. కాలువలు బాగు చేసి శివారు గ్రామాలకు చెందిన సుమారు 1500 ఎకరాలకు నీరందించాలని సంబంధిత ఇరిగేషన్ అధికారులకు ఎన్ని సార్లు వినతులు అందించినా కనీసం స్పందించలేదని కలెక్టర్ కు 12 గ్రామాలకు చెందిన రైతు ప్రతినిధులు వివరించారు.
నీటి పారుదల శాఖ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
మడ్డువలస జలాశయం కి చెందిన శివారు గ్రామల ఆయకట్టు రైతులు కలెక్టర్ ని కలసి తమ ఆవేదన వినతి పత్రంతో తెలియపరిచారు. ఇంత వరకు తమ భూములకు నీరు అందక, పంటలు ఎండిపోతున్నాయని రైతులు తమ బాధను తెలిపారు. మడ్డువలస కాలువల్లో పైడికతీత కోసం ఇటీవల ఐదు లక్షల రూపాయిలు మంజూరు చేశానని..! పూడికతీత జరగలేదా అని ..! ఆశ్ఛర్యం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న ఇరిగేషన్ డి.ఇ. కలెక్టర్ ప్రశ్నించారు. ఐదు లక్షల రూపాయిలు పూడికతీత కోసం ఇచ్చిన డబ్బు ఏం చేశారని ప్రశ్నించారు. ఆ వివరాలు తనకు అందించాలని ఆదేశించారు. శివారు గ్రామాలకు చెందిన 12 గ్రామాలకు చెందిన రైతులకు ఏమేరకు కాలువ పూడికతీతలు తీయాల్లో తనకు నివేదిక అందిస్తే, నిధులు మంజూరు చేస్తానని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్పందనకు రైతులు హర్షం తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు పప్పల విశ్వేశ్వరరావు, డోల సీతారాం, ఏ అచ్యుతరావు , పతివాడ రాంబాబు, ఏ నీలకంఠం, కే బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. (Story : మడ్డువలస జలాశయం శివారు ఆయకట్టు రైతులు ఆందోళన)