సాయుధ పోరాట యోధుల త్యాగం అజరామరం : సిపిఐ
న్యూస్‌తెలుగు/వనపర్తి : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల త్యాగం అజరామరమని సిపిఐ జిల్లా కార్యదర్శి కే విజయ రాములు, పలువురు నేతలు కీర్తించారు. సెప్టెంబర్ 11వ తేదీ నుంచి 16 వరకు జిల్లా లోని పలు గ్రామాల్లో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించారు. మంగళవారం వనపర్తి అంబేద్కర్ చౌక్ లో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభ సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్ అధ్యక్షన జరిగింది. తెలంగాణ సాయుధ పోరాట యోధులు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దుం మొయినుద్దీన్,చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య, జర్నలిస్ట్ సోయబుల్లాఖాన్ చిత్రపటాలకు మహిళా సమాఖ్య ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు కళావతమ్మ పూలమాలతో అలంకరించారు. నేతలు వారికి ఘనంగా నివాళులర్పించారు. సిపిఐ ఆఫీస్ వద్ద జిల్లా కార్యదర్శి కే విజయ రాములు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, అంబేద్కర్ చౌక్ లో అరుణ పతాకాన్ని సీనియర్ నేత బొలెమోని నాగన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయ రాములు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీరామ్, ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, సిపిఐ పట్టణ కార్యదర్శి జే రమేష్, ఏఐటీయూసీ రాష్ట్ర నేత పి సురేష్ తదితరులు మాట్లాడారు. నిజాం పాలనలో ‘బాంచన్ నీ కాల్మొక్త’అంటూ వెట్టి చేస్తున్న ప్రజల్లో చైతన్యం నింపి భూమి కోసం, భుక్తి కోసం వెట్టిచాకి విముక్తి కోసం నడిపినదే సాయుధ పోరాటమన్నారు. ఈ పోరాటంలో 4,500 మంది కమ్యూనిస్టులు అమరులయ్యారన్నారు. ఫలితంగానే తెలంగాణ భారత దేశంలో విలీనమైందన్నారు. ఇంతటి మహత్తర ప్రజల విముక్తి పోరాట చరిత్రను బిజెపి హిందూ, ముస్లిం పోరాటంగా వక్రీకరించే కుట్ర చేస్తుందన్నారు. ‘విమోచన దినం’పేరుతో ఉత్సవాలను ఇందుకు సాక్ష్యం అన్నారు. కెసిఆర్ సెప్టెంబర్ 17ను అధికారికంగా జరుపుతామని మాట తప్పారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ‘ప్రజా పాలన’ పేరుతో ఈరోజు ఉత్సవాలను నిర్వహిస్తుందన్నారు ‘విలీన దినం’పేరుతో ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలను నిర్వహించాలని, విద్యార్థులకు స్ఫూర్తి కలిగించే పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం స్ఫూర్తితో ప్రజలు హక్కుల కోసం ఉద్యమించాలని కోరారు. జిల్లా పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు ఉత్సవాల్లో పాల్గొన్నారు. సిపిఐ, ఏఐటీయూసీ, మహిళా సమాఖ్య, ఏఐవైఎఫ్ నాయకులు జె.చంద్రయ్య, కళావతమ్మ, శ్రీరామ్, రమేష్, గోపాలకృష్ణ, ఎత్తం మహేష్, పి. సురేష్, కుతుబ్, కాకం బాలస్వామి, ఎర్రకురుమయ్య, లక్ష్మీనారాయణ,తిరుపతయ్య, రాజనగరం కృష్ణయ్య, లక్ష్మమ్మ, జయమ్మ, శిరీష, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు. (Story : సాయుధ పోరాట యోధుల త్యాగం అజరామరం : సిపిఐ)