రాచరిక పాలన నుండి ప్రజాపాలన
న్యూస్‌తెలుగు/వనపర్తి : సెప్టెంబర్ 17, 1948 న తెలంగాణ భారతదేశంలో విలీనమై రాచరిక పాలన నుండి ప్రజాపాలన దిశగా రూపుదిద్దుకున్నదని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇట్టి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తుందని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డు కులాల కో ఆపరెటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్ పర్సన్ ఎన్. ప్రీతం అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
మంగళవారం ఐ.డి. ఒ.సి వనపర్తి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ప్రీతమ్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణ విమోచన పోరాటంలో అసువులు బాసిన అమర వీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డితో కలిసి వేదికను పంచుకొని జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
భూస్వాముల దగ్గర బానిసలుగా బతకాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితులను ఎదిరించి నిలవడానికి ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చింది. అందులో ముఖ్యమైనది 1946 లో ప్రారంభమయిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అప్పటి పోరాటంలోఎందరో ప్రాణాలను కోల్పోవడం జరిగింది. ఒక వైపు రైతాంగ పోరాటం జరుగుతున్న సమయంలోనే 1947లో మన దేశానికి స్వాతంత్ర్యo వచ్చింది అన్నారు. సెప్టెంబర్ 17, 1948న తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్యం లభించింది. కావున ఈ రోజు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను రాష్ట్రమంతటా ఘనంగా జరుపుకోవడానికి నిర్ణయించి కార్యక్రమాలను చేయడం జరుగుతున్నది.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారంలో ముందుంది. ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయడం ప్రారంభించింది. గ్రామ సభలు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకాలు అమలు చేస్తున్నాం అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో పాటు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పి. మహేష్, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. (Story : రాచరిక పాలన నుండి ప్రజాపాలన)