ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే
విజయ రాములు
న్యూస్‌తెలుగు/వనపర్తి : నాడు , నేడు ఏనాడైనా ప్రజల పక్షాన నిలబడి పోరాడేది కమ్యూనిస్టులేనని సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయ రాములు అన్నారు. రేవల్లి మండలం తలుపునూరు లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహించారు. అరుణ పతాకాన్ని ఆవిష్కరించి, తెలంగాణ సాయుధ పోరాట యోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. 70 ఏళ్ల క్రితం నిజాం నవాబు, రజాకర్ల, భూస్వాముల పీడనలో నలిగిపోతున్న తెలంగాణ ప్రజలలో చైతన్యం రగిలించింది కమ్యూనిస్టులే ఉన్నారు. ఫలితంగా వెట్టి చాకిరి చేస్తున్న సామాన్య ప్రజలు తుపాకులు చేతబట్టి వీరులై పోరాడారన్నారు. భూస్వాములను తరిమికొట్టి, వారి కబంధహస్తాల్లో ఉన్న భూమిని పేదలకు పంచారన్నారు. వెట్టి చాకిరి నుంచి విముక్తి కావటమే గాక తెలంగాణ భారత దేశంలో విలీనానికి కారకులయ్యారన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన పాలకుల వైపల్యం వల్ల వారి ఆశయాలు నెరవేరలేదన్నారు. తిండికి రేషన్ కార్డు కోసం, నిలువ నీడ కోసం ఇళ్ల స్థలాలు, ఇళ్ల కోసం, ఆర్థిక ఆసరాకు పింఛన్ల కోసం ప్రజలు ఎదురుచూడాల్సిన నేడు కొనసాగుతోందన్నారు. కమ్యూనిస్టులు ప్రజలను చైతన్యం చేసి పోరాటాలు సాగిస్తున్నారన్నారు. వరంగల్, హైదరాబాద్, మల్కాజ్గిరి తదితర జిల్లాలలో సిపిఐ భూ పోరాటాలు, గుడిసెల పోరాటాలు చేస్తోందన్నారు. దేశాన్ని సంపన్నులకు కట్టబెడుతున్న బిజెపికి ఇతర పాలక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత కమ్యూనిస్టులపైనే పడిందన్నారు. హక్కుల కోసం న్యాయం కోసం పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలని కోరారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, జె. చంద్రయ్య, కే శ్రీరామ్, జె రమేష్, గోపాలకృష్ణ, కుతుబ్, మహేష్, లక్ష్మీనారాయణ, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే )