నిజాం ప్రభుత్వాన్ని కూల్చిన ఘనత కమ్యూనిస్టులదే
నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్పూర్తితో ఉద్యమించాలి
సాయుధ పోరాటంలో ఇసుక రేణువంత పాత్ర కూడా బిజెపికి లేదు–సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం
పదిలక్షల ఎకరాల భూమిని పేదలకు పంచింది కమ్యూనిస్టులే
రాష్ట్ర ప్రభుత్వం విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
సీపీఐ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
న్యూస్ తెలుగు / భద్రాద్రి కొత్తగూడెం : నాటి దొరలు, దేశముఖ్ లు, రజాకారుల మూకలను తరిమికొట్టి తెలంగాణకు విముక్తి కలిగించింది కమ్యూనిస్టులేనని, అదే స్పూర్తితో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న నేటి పాలకులను తరిమికొట్టాల్సిన అవసరం ఉందని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ఈ సేవ సెంటర్ వద్ద సాయుధ పోరాట యోధులు ఉషారావు, రామకోటయ్యల స్థూపం వద్ద తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. తొలుత అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో భారత కమ్యూనిస్టు పార్టీ పాత్ర ఎంతో ఉందని, భూమి కోసం, భుక్తి కోసం, అణగారిన వర్గాల కోసం ముఖ్యంగా రైతుల సమస్యల గురించి, రజాకారుల రాజకీయ పాలనను అంతమొందించడంలో సిపిఐ కీలకపాత్ర పోషించిందన్నారు. 1947 సెప్టెంబర్ 11న అమరవీరులు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖుం మోహియుద్దీన్ పిలుపుతో మహోద్యమం ప్రారంభం అయ్యిందని, వారి నాయకత్వంలో సాగిన సాయుధ పోరాటం వందల ఏండ్ల చరిత్ర ఉన్న నిజాం రాజును గద్దె దింపిందని, నిజాం స్వాదీనంలో ఉన్న తెలంగాణా భూ భాగాన్ని భారతదేశంలో అంతర్భాగం చేసిందన్నారు. అదే ప్రమాదకర పరిస్థితులు ప్రస్తుతం దేశంలో నెలకొన్నాయన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఇసుక రేణువంత పాత్ర కూడా బిజెపికి లేదని, ఈ పోరాటాన్ని తామే చేసినట్లుగా చెప్పుకోవడం, ఉత్సవాలకు సిద్ధం కావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పదిలక్షల ఎకరాల భూమిని ఈ పేదలకు పంచిన ఘనత సిపిఐ కే దక్కుతుందని తెలిపారు. గత పది ఏళ్లగా నియంతలాగా వ్యవహరించిన కేసీఆర్ ప్రభుత్వం విలీన దినోత్సవం అధికారికంగా నిర్వహించలేదని నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి అడుసుమిల్లి సాయిబాబా మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, ఉప్పుశెట్టి రాహుల్, డి సుధాకర్, వి పద్మజ, నాయకులు అన్నారపు వెంకటేశ్వర్లు ఇట్టి వెంకట్రావు, శనగారపు శ్రీనివాసరావు, నరహరి నాగేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ చెన్నయ్య, మాజీ సర్పంచ్ విజయ్ వేములపల్లి శేఖర్, వైఎస్ గిరి, sk లాల్ పాషా, SA రెహమాన్, కరీం, సత్యనారయణ, ఆదినారాయణ, జర్పుల మోహన్, బాబు, వెంకన్న, సూరజ్ తదితరులు పాల్గొన్నారు.(Story:నిజాం ప్రభుత్వాన్ని కూల్చిన ఘనత కమ్యూనిస్టులదే.)