అప్రమత్తంగానే ఉన్నాం
సాయన్న ఛానల్ ముంపు పొలాలను పరిశీలించిన కలెక్టర్
వంగర సంతకవిటి మండలాల్లో విస్తృత పర్యటన
న్యూస్‌తెలుగు/విజయనగరం : జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా అప్రమత్తం గానే ఉన్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పారు. మరో 24 గంటలపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రత్యేక అధికారులంతా మండలాల్లోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించినట్లు తెలిపారు. వర్షాల కారణంగా జిల్లాలో ఎక్కడా పెద్దగా నష్టం వాటిళ్ళలేదని చెప్పారు. గెడ్డలు, వాగులు, కాజ్ వే ల వద్ద కాపలా ఉంచి, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
ఆయన సోమవారం వంగర, సంతకవిటి మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. ముందుగా మడ్డువలస రిజర్వాయర్ ను పరిశీలించారు. నీటి మట్టం, ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో గురించి ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్లో పేరుకుపోయిన గుర్రపు డెక్కను వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇన్ ఫ్లో ను బట్టి నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మండల ప్రత్యేక అధికారి సందీప్ కుమార్, ఆర్డీవో బి.శాంతి, తహసీల్దార్ ధర్మరాజు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
సంతకవిటి మండలంలో కలెక్టర్ పర్యటించారు. సాయన్న గెడ్డ ఛానల్ వల్ల ముంపునకు గురైన రామరాయపురం, మంతిన, పోడలి గ్రామాల పంట పొలాలను రామరాయపురం వద్ద కలెక్టర్ పరిశీలించారు. అక్కడి పరిస్థితిని రాజాం ఎంఎల్ఏ కోండ్రు మురళీమోహన్ కలెక్టర్ కు వివరించారు. సుదీర్ఘ కాలంగా ఈ గెడ్డ వల్ల రైతులు నష్టపోతున్నారని, దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనాలని ఎంఎల్ఏ కోరారు. రైతులతో కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వర్షాలు తగ్గిన వెంటనే ఛానల్లో పూడిక తీత పనులను మొదలు పెట్టాలని ఆదేశించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు త్వరలో సంబంధిత అధికారులు సమావేశమై సమగ్ర ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ సూచించారు. పర్యటనలో ఎంఎల్ఏ కోండ్రు తో బాటు ఎంపిపి జి.అప్పలనాయుడు, మండల ప్రత్యేక అధికారి బి.సుధాకరరావు, ఆర్డీవో బి. శాంతి, తహసీల్దార్ కళ్యాణ చక్రవర్తి, ఏవో నవీన్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. (Story : అప్రమత్తంగానే ఉన్నాం)