ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనం
నిమజ్జనం కోసం రెండు క్రేన్లను ఏర్పాటు : మంత్రి సత్య కుమార్ యాదవ్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ధర్మవరం పట్టణంలో గణపతి నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి మున్సిపల్ అధికారులతో మాట్లాడి, రెండు పెద్ద క్రేన్లను ఏర్పాటు చేయించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ళు, వీధుల్లో పోలీసుల పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకున్నారు. నిమజ్జనం సందర్భంగా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకూడదని ఏర్పాట్లను చేయించారు. పోలీసు శాఖ అధికారులతో పాటు వైద్య, విద్యుత్తు, ఇంకా వివిధ శాఖల అధికారులను నిమజ్జనం సందర్భంగా ఏ చిన్న సమస్య తలెత్తకుండా మంత్రి అప్రమత్తం చేశారు. మంత్రిగారి కార్యాలయ సిబ్బంది పట్టణంలో విగ్రహాల ఊరేగింపు దగ్గర నుండి చెరువు వద్ద నిమజ్జనం చేసే వరకు దగ్గర ఉండి ప్రజలు ఇబ్బందులు పడకుండా నిరంతరం పర్యవేక్షించారు. ఆ ప్రాంతంలో తలెత్తిన సమస్యలను వెంటనే సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి పరిష్కరించి, భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా చెరువు సమీపంలో జెసిబి లతో శుభ్రం చేయించడంతోపాటు, క్రేన్లను ఏర్పాటు చేసినందుకు పట్టణంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్న మంత్రి కు ధర్మవరం ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ ప్రాంతంలో వరద సహాయక చర్యల్లో పాల్గొంటూ తీరిక లేకుండా ఉన్నప్పటికీ మంత్రి ధర్మవరం ప్రజల కోసం సౌకర్యాలను కల్పించడం పట్ల ప్రజలు ఆయనకు ధన్యవాదములు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు డోలా రాజారెడ్డి, డి.చెర్లోపల్లి నారాయణస్వామి, ఎస్పీ రత్న, వన్ టౌన్ సిఐ నాగేంద్రప్రసాద్, డిఎస్పి టి శ్రీనివాసులు, వైద్య నిపుణులు, తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనం)

