విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో వ్యాధులపై రేపటి నుండి
ఇంటింటి సర్వే
నాలుగు రోజుల సర్వే కోసం 150 వైద్య బృందాల ఏర్పాటు
సర్వే సిబ్బందికి శిక్షణ అందించిన వైద్య ఆరోగ్య శాఖ
వరద పీడిత ప్రజలకు మానసిక స్థైర్యాన్ని కూడా కల్పించాలన్న మంత్రి సత్యకుమార్ యాదవ్
మానవతా ధృక్పధం, ఉద్యోగ బాధ్యతతో సర్వే నిర్వహించాలన్న మంత్రి
న్యూస్‌తెలుగు/విజయవాడ,సెప్టెంబరు8 :విజయవాడలో భారీ వర్షాలతో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో వ్యాధుల వ్యాప్తిపై రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం నుండి ఇంటింటి సర్వే చేపట్టనుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ సర్వేను నిర్వహించేందుకు 150 వైద్య బృందాల్ని నియమించారు. ప్రతి బృందంలో ముగ్గురు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, ఒక ఎఎన్ ఎం ఉంటారు.వరద ముంపు పూర్తిగా తొలగిన 32 మునిసిపల్ వార్డుల్లో ఈ సర్వే జరుగనుంది.ఈ 32 వార్డుల్లో మొత్తం 149 వార్డు సచివాలయ కేంద్రాలు ఉన్నాయి. ఈ మేరకు ప్రతి సిహెచ్‌వో ఈ నాలుగు రోజుల్లో 300 నుండి 400 కుటుంబాల్లోని సభ్యుల ఆరోగ్య వివరాల్ని సేకరిస్తారు. దగ్గు, జలుబు, జ్వరం, బీపీ, మధుమేహం, చర్మ వ్యాధులు, పాము మరియు తేలు కాట్లు, గాయాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తారు. ఇప్పటి వరకు ఆరోగ్య శాఖ అందజేసిన లక్షకు పైగా అత్యవసర మందుల కిట్లు లభ్యత, మందుల అవసరాలకు సంబంధించిన సమాచారాన్ని సిహెచ్వోలు ఈ సర్వేకోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో పొందుపరుస్తారు.
కుటుంబ సభ్యులు అందించిన సమాచారం మేరకు వ్యాధి తీవ్రతను బట్టి సమీపంలోని అర్బన్ పిహెచ్ సీకి కానీ, మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలకు, ప్రభుత్వాసుపత్రులకు పంపిస్తారు. కిట్లు అందని వారికి వెంటనే సిహెచ్వోలు అందిస్తారు. కిట్లలో లేని ప్రత్యేక మందులు ఏమైనా అవసరమైతే వాటిని
మరుసటి రోజు ఆయా సచివాలయాలకు సంబంధించిన ఎఎన్ ఎంలు ఆయా కుటుంబాలకు అందజేస్తారు.
ఈ ఇంటింటి సర్వే ద్వారా విజయవాడను అతలాకుతలం చేసిన భారీ వర్షాలు, వరదల వలన ఎటువంటి వ్యాధులు, ఏయే ప్రాంతాల్లో అధికంగా ప్రబలుతున్నాయో తెలుసుకుని ఆ మేరకు వైద్య సహాయం అందించడానికి వీలవుతుందని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గత యాభై సంవత్సరాలుగా చూడని విపత్తును విజయవాడ ప్రజలు ఎదుర్కొంటున్నారని, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్న సందేశాన్ని ప్రజలకు అందించడానికి ఈ సర్వే చేపట్టి, ఆమేరకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు.
ఇంటింటి సర్వే చేపట్టనున్న సిహెచ్వోలకు మంత్రిత్వ శాఖ నేడు విజయవాడలో నిర్వహించిన శిక్షణా శిబిరంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ సర్వే లక్ష్యాల్ని వివరించారు. విపత్తుకు గురైన సాటి ప్రజల్ని ఆదుకోవడం మానవతా వాదమని, దీంతోపాటు వైద్య సిబ్బందికి అవసర సమయాల్లో ప్రజలకు తగు సేవలు అందించాల్సిన బాధ్యత కూడా ఉందని….ఈ మేరకు ఈ నాలుగు రోజుల సర్వేను చిత్తశుద్ధితో నిర్వహించి ప్రజల మన్నల్ని పొందాలని మంత్రి ఉద్భోదించారు.
వరదకు గురై పలు విధాలుగా నష్టపోయిన ప్రజలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని, వారికి తగు సలహాలిచ్చి మానసిక ఒత్తిడిని తగ్గించాలని మంత్రి సత్యకుమార్ సూచించారు. ఈ మేరకు కష్టాలకు గురై ఆందోళనతో ఉన్న బాధితులతో ఏ విధంగా మాట్లాడాలి, వారిలో ఒత్తిడిని తగ్గించడానికి ఎటువంటి సలహాలు ఇవ్వాలన్న అంశంపై కూడా మానసిక వైద్య నిపుణులతో సలహాలిప్పించారు. మానసిక ఒత్తిడితో పాటు వచ్చే నిద్రలేమి, అసహనం, అభద్రత వంటి లక్షణాల్ని తగ్గించేందుకు అవసరాల మేరకు తగు మందుల్ని అందించేలా చూడాలని మానసిక వైద్యులు సూచించారు.
ఈ సర్వే సమయంలో వివిధ రకాల వ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు చేయాలని శిక్షణా శిబిరంలో ప్రసంగించిన మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు కోరారు. వరద బాధిత ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని, ఆ మేరకు వైద్య బృందాలు ఇంటింటి సర్వేను పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఆరోగ్య , కుటుంబ సంక్షేమ కమీషనర్ శ్రీ హరికిరణ్ ఈ సర్వే కోసం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ను సర్వే బృందాల సభ్యులకు వివరించారు. వరద బాధిత ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ 181 వైద్య శిబిరాల్ని నిర్వహిస్తోందని, వివిధ వార్డు సచివాలయాల కేంద్రాల పరిధిల్లోని ఆ శిబిరాలకు అవసరాల మేరకు బాధితుల్ని పంపాలని ఆయన కోరారు.సర్వే ఫలితాల మేరకు ఎప్పటికప్పుడు అవసరమైన మందుల్ని అందిస్తామని ఆయన తెలిపారు.(Story:విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో వ్యాధులపై రేపటి నుండి ఇంటింటి సర్వే)