జిల్లాలో భారీ నుంచి అతి భారీవర్షాలకు అవకాశం
ఎలాంటి ఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా వుండాలి
ఎక్కడా ప్రాణనష్టం జరగడానికి వీల్లేదు
సహాయక చర్యలకోసం వెనుకాడొద్దు
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలి
జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ ఆదేశాలు
జిల్లాలో ఆదివారం సగటున పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
విజయనగరం,
జిల్లాలో సోమవారం కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా, మండల స్థాయి అధికారులంతా అత్యంత అప్రమత్తంగా వుంటూ వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టానికి అవకాశం లేకుండా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ ఆదేశించారు. నోడల్ అధికారులు, మండలాల్లోని తహశీల్దార్లు, ఎంపిడిఓలు తమ మండలాల్లోనే వుంటూ ఆయా గ్రామాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకొని అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో వర్షాల కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట లోతట్టు ప్రజలను తరలించేందుకు పునరావాస శిబిరాలు కూడా ఏర్పాటు చేసేందుకు వెనుకాడొద్దని సూచించారు. వర్షాల నేపథ్యంలో వాగులు, గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయని, యీ కారణంగా ప్రజలు ప్రమాదాలకు గురికాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలపై జిల్లా కలెక్టర్ ఆదివారం సాయంత్రం అధికారులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించి సూచనలు చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం జిల్లా కలెక్టర్లతో వర్షాల పరిస్థితులపై సమీక్షించారని అన్ని ప్రభుత్వ శాఖలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించినట్టు తెలిపారు. జిల్లాలో రిజర్వాయర్లలో నీటి నిల్వలు ప్రమాదకరంగా లేవని, అయితే జిల్లాలో కురిసే వర్షాల కారణంగా కొన్నిచోట్ల నదుల్లో ప్రవాహాలు వస్తున్నాయని, వీటిని దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా వుండాలన్నారు. వర్షాల కారణంగా గ్రామాల్లో ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామీణ నీటిసరఫరా అధికారులను ఆదేశించారు.
అన్ని గ్రామాల్లోనూ వీలైనంత ఎక్కువగా వైద్య శిబిరాలను నిర్వహించి వర్షాల వల్ల ప్రజలు వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య అధికారిని కలెక్టర్ ఆదేశించారు.
వర్షాల వల్ల ఎక్కడైనా విద్యుత్ అంతరాయాలు ఏర్పడితే వాటిని సరిచేసి వెంటనే సరఫరా పునరుద్దరించేలా చర్యలు చేపట్టాలని ఇ.పి.డి.సి.ఎల్. పర్యవేక్షక ఇంజనీర్ ను ఆదేశించారు.
జిల్లాలో ముఖ్యమైన రిజర్వాయర్లలో నీటినిల్వలను కొంత మేర ఖాళీచేసి వుంచామని, భారీవర్షాలు కురిసినా ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు చేపట్టామని ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల సి.ఇ. ఎస్.సుగుణాకర్ రావు వివరించారు.
వర్షాల నష్టం అంచనాలను సిపిఓకు అందజేయండి
జిల్లాలో భారీ వర్షాల కారణంగా వివిధ శాఖలకు జరిగిన నష్టాలను అంచనా వేసి ముఖ్య ప్రణాళిక అధికారికి అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా రెవిన్యూ అధికారి, సిపిఓ కలసి నష్టం అంచనాలు రూపొందించి నివేదిస్తారని చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం ఒక యాప్‌ను రూపొందించినట్లు చెప్పారు.