గంజాయి రహిత జిల్లాగా చేయడమే లక్ష్యం
జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్
ఈ ఏడాది 49 గంజాయి కేసులు నమోదు : జిల్లా ఎస్.పి వకుల్ జిందాల్
న్యూస్‌తెలుగు/ విజయనగరం : గంజాయి ఉత్పతిని, రవాణాను, వినియోగాన్ని అరికట్టి గంజాయి రహిత జిల్లాగా విజయనగరం ను నిలపాలని, అందుకు పోలీస్, ఇతర శాఖలు సమన్వయం తో పని చేయాలనీ జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు. విద్యా సంస్థల్లో యాంటి డ్రగ్ కమిటీ లను వేసి డ్రగ్స్ వినియోగం వలన జరిగే నష్టాల గురించి అవగాహన కలిగించాలని తెలిపారు. అదే విధంగా బస్సు స్టాండ్ లో, రైల్వే స్టేషన్లలో , కూడళ్ళ లో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా కూడా అవగాహన కలిగించాలని తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో మత్తు పదార్ధాలు, మాదక ద్రవ్యాల నిరోధక జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. గంజాయి రవాణా ను అరికట్టడానికి ప్రధానంగా రాయగడ, కోరాపుట్, ఎ.ఎస్.ఆర్ జిల్లాల రూట్లలో తిరిగే ఆర్.టి.సి డ్రైవర్స్ కు, కండక్టర్లకు గట్టి నిఘా ఉండేలా చూడాలని తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన, అటవీ శాఖల అధికారులు గంజాయి పంట ఎక్కడైనా వేస్తున్నారేమోనని కన్నేసి ఉంచాలన్నారు.ఎక్కడైనా అనుమానాస్పదంగా ఉంటె పోలీస్ కు అప్పగించాలని తెలిపారు.
జిల్లా ఎస్.పి వకుల్ జిందాల్ మాట్లాడుతూ ఈ ఏడాది ఇంతవరకు 49 కేసు లను నమోదు చేసి 1109 కేజీ ల గంజాయి ను సీజ్ చేసామని, ఇందుకు సంబంధించి 140 మంది ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. జిల్లాలో గంజాయి సాగు లేదని, అయితే సరిహద్దు జిల్లాలైన ఎ.ఎస్.ఆర్ , పార్వతీపురం మన్యం , శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల నుండి రవాణా జరుగుతోందని తెలిపారు. జిల్లాలో డీ అడిక్షన్ కేంద్రం ఉన్నప్పటికీ పూర్తి స్థాయి లో పని చేయడం లేదని, వెంటనే దానిని పునరుద్ధరించాలని కలెక్టర్ ను కోరారు. జిజిహెచ్ లో 15 బెడ్ వార్డ్ ఉందని, అయితే సంబంధిత మెడికల్ ఆఫీసర్ 6 నెలల క్రితమే రిసైన్ చేసారని, ప్రస్తుతం ఆ పోస్ట్ ఖాళీ గా ఉందని డి.ఎం.హెచ్ ఓ డా.భాస్కర రావు తెలిపారు. కలెక్టర్ స్పందిస్తూ వెంటనే డీ అడిక్షన్ కేంద్రం పని చేయాలనీ, ఏమేం అవసరమో ప్రతిపాదించి ఫైల్ వెంటనే పెట్టాలని ఆదేశించారు. మందుల దుకాణాల్లో వైద్యుల చీటీ లేకుండా అమ్మే మందుల పై డ్రగ్ కంట్రోల్ అధికారి దృష్టి పెట్టాలని , మందుల దుకాణాల్లో మత్తు పదార్ధాల అమ్మకాలను అరికట్టాలని ఎస్.పి తెలిపారు. విద్య సంస్థలలోనూ, పబ్లిక్ స్థలాల్లో ను అవగాహనా సదస్సులు నిర్వహించాలని అన్నారు. సరిహద్దు జిల్లాల్లో వాహనాల ఆకశ్మిక తనిఖీలను నిర్వహించాలను, రైళ్ళ లో, రైల్వే స్టేషన్లలో గట్టి నిఘా ఉంచాలన్నారు.
ఈ సమావేశం లో జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వర రావు, ఉప రవాణా కమీషనర్ మని కుమార్ , ఆర్.డి.ఓ లు సూర్యకళ , శాంతి, సాయి శ్రీ, డి.ఎస్.పి లు గోవింద రావు, శ్రీనివాస రావు , జి.ఎస్.టి జాయింట్ కమీషనర్, డి.పి.ఓ శ్రీధర్ రాజ, జిల్లా వ్యవసాయ అధ్దికారి తారక రామా రావు, బాలల సంరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షులు హిమ బిందు , కళాశాలల ప్రిన్సిపాళ్లు , పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.