కోటి విరాళం ప్రకటించిన జగన్
న్యూస్ తెలుగు/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని వరద బాధితులను ఆదుకునేందుకుగాను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. బాధితులకు కోటి రూపాయలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. గత సోమవారం విజయవాడ సింగ్‌నగర్ వరద ముంపు బాధిత ప్రాంతాల్లో జగన్ పర్యటించారు. అనంతరం తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వరద ముంపు బాధితులకు చంద్రబాబు ప్రభుత్వం అందిస్తున్న సేవలపై చర్చించారు.వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేయడం లేదని నేతలు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. లక్షలాది మంది కనీసం ఆహారం, మంచినీరు కూడా దొరక్క నానా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. జగన్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ ఘోర తప్పిదం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని, అయినా నింద తమపై మోపేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. బాధితులను ఆదుకునేందుకు కోటి రూపాయలు ప్రకటించామని, అది ఏ రూపంలో ఇవ్వాలనేదీ వెల్లడిస్తామని జగన్ చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కాపు కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ అడపా శేషు, పార్టీ నాయకుడు షేక్ ఆసిఫ్ పాల్గొన్నారు. (Story: కోటి విరాళం ప్రకటించిన జగన్)