UA-35385725-1 UA-35385725-1

ప్రతి పేద‌వానికి ‘ఎన్టీఆర్ భరోసా’

ప్రతి పేద‌వానికి ‘ఎన్టీఆర్ భరోసా’

– హామీకి కట్టుబడి తొలి నెల నుండే రూ.4వేల పెన్షన్

– మచిలీపట్నంలో సాయంత్రానికి 100 శాతం పంపిణీ పూర్తి

– పెన్షన్ల పంపిణీపై సచివాలయ సిబ్బంది చొరవ అభినందనీయం

– నిండు గర్భిణిగా ఉండీ పెన్షన్లు పంపిణీ చేయడం హర్షణీయం

– భారీ వర్షంలోనూ పెన్షన్ల పంపిణీ చేపట్టిన మంత్రి కొల్లు రవీంద్ర

న్యూస్‌తెలుగు/మచిలీపట్నం : పేదలకు ఆర్ధికంగా భరోసా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నడచుకుంటోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలోని గిలకలదిండి, బుద్దాలపాలెం గ్రామాల్లోని లబ్దిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. భారీ వర్షంలోనూ ఇంటింటికీ వెళ్లి లబ్దిదారులకు పెన్షన్లు అందించారు. ఆయా కుటుంబాల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. లబ్దిదారుల ఆర్ధిక స్థితిగతులు, కుటుంబ పరిస్థితులు తెలుసుకున్నారు.  పేదరికాన్ని అరికడతామన్న మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే ఆర్ధిక కష్టాలున్నా, ఇబ్బందులు ఎదురైనా.. హామీ మేరకు తొలి నెల నుండే పెన్షన్లు రూ.4వేలకు పెంచామన్నారు.
పెన్షన్ల చరిత్ర తెలుగుదేశానిదే
పెన్షన్లను ప్రారంభించిందే తెలుగుదేశం ప్రభుత్వమని, ఎన్టీఆర్ రూ.30తో పెన్షన్లు ప్రారంభిస్తే.. చంద్రబాబు రూ.75 చేశారన్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ముక్కీ మూలిగీ రూ.200 చేస్తే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏకంగా రూ.2000 చేశారు. రూ.3000 చేస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక విడతల వారీ పెంపు పేరుతో పెన్షన్ దారుల్ని దగా చేశాడు. ఏటా పెంపు మాటపై కూడా నిలబడకుండా మోసం చేశాడు. ఒక్కో లబ్దిదారుడికి ఏకంగా రూ.40 వేల వరకు ఎగనామం పెట్టాడు. కానీ, చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే హామీ మేరకు రూ.4 వేలకు పెంచడమే కాకుండా ఏప్రిల్ నుండే పెంపు అమలు చేశారు. పేదల పక్షాన నిలిచే నాయకుడు కాబట్టే పేదల కష్టాలు గుర్తించారన్నారు.
తొలిరోజే 100 శాతం పెన్షన్లు పంపిణీ చేస్తాం
పనులు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న వారు, వితంతువులు, దివ్యాంగులు, కుల వృత్తులు చేసుకునే వారికి పెన్షన్లను ప్రారంభించింది కూడా చంద్రబాబేనన్నారు. ఇప్పుడు కూడా ఒకటో తేదీ ఆదివారం రావడంతో.. ఒక రోజు ముందుగానే పెన్షన్లు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గతంలో పదో తేదీ వరకు పెన్షన్లు పంపిణీ చేసేవారని, కానీ మేము ప్రజల గురించి ఆలోచించి.. ఒకే రోజు 100 శాతం పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్నారు. ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా చేసేందుకే ముందు రోజు పంపిణీ ప్రారంభించామని తెలిపారు.
పెన్షన్ల పంపిణీలో ఉద్యోగుల చొరవ అభినందనీయం
పెన్షన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగుల చొరవ అభినందనీయమని తెలిపారు. భారీ వర్షంలో కూడా ఉద్యోగులు ఉదయాన్నే పంపిణీలోకి రావడం సంతోషంగా ఉంది. నిండు గర్భిణిగా ఉన్నప్పటికీ.. ఒక ఉద్యోగి తెల్లవారు జామునే పెన్షన్ల పంపిణీలో పాల్గొనడం హర్షణీయం అన్నారు. ఆమె చిత్తశుద్ధికి మంత్రి కొల్లు రవీంద్ర ధన్యవాదాలు తెలిపారు.
పెన్షన్ దారుల హర్షం
పెన్షన్ల పెంపు, ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయడం పట్ల పెన్షన్ దారులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ సొమ్మును డ్వాక్రాలో పొదుపు చేసుకుంటూ భవిష్యత్తుకు వినియోగించుకుంటున్నట్లు వితంతువు హర్షం వ్యక్తం చేశారు. బుట్టలతో చేపలు అమ్ముకుంటున్నానని, పెన్షన్ సొమ్ము పెట్టుబడిగా ఉపయోగపడుతోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పెన్షన్ సొమ్మును పెంచడంతో మందులు, వైద్య ఖర్చులకు ఇబ్బందులు తొలగిపోయాయని పలువురు వృద్ధులు సంతోషం వ్యక్తం చేశారు. దివ్యాంగుల పెన్షన్ మొత్తాన్ని రూ.15 వేలకు పెంచడంపై పలువురు దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా అందిన పెన్షన్ మొత్తంతో వైద్యానికి, ఇతర ఖర్చులకు ఆటంకాలు తొలగిపోయాయని దివ్యాంగులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో పెన్షన్ సొమ్ములో కొంత మొత్తం వాలంటీర్లు తీసుకునే వారని, ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోవడం పట్ల పలువురు పెన్షన్ దారులు సంతోషం వ్యక్తం చేశారు. (Story : ప్రతి పేద‌వానికి ‘ఎన్టీఆర్ భరోసా’)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1