ఆజాద్ నగర్ కాలనీ సమస్యలపై వినతి పత్రం
న్యూస్‌తెలుగు/వినుకొండ : గత 19 సంవత్సరాలుగా వినుకొండలోని ఆజాద్ నగర్ కాలనీకి మౌలిక వసతులు లేక అక్కడ ఉంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ , సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ ముప్పాళ్ళ నాగేశ్వరావు ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ ని శుక్రవారం సచివాలయంలో కలిసి వారికి ఆజాద్ నగర్ కాలనీ సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ. వినుకొండ నియోజకవర్గం లో ఇళ్ళు లేని పేదవాళ్లందరూ అన్యాక్రాంతమైన ఆజాద్ నగర్ కాలనీలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో 2006లో భూ పోరాటం చేసి సుమారుగా 6000 ఇళ్ళు నిర్మించుకొని ఉంటున్నారని, నేటికీ వీరు ఇక్కడ ఇల్లు నిర్మించుకొని 19 సంవత్సరాలు అవుతున్న కాలనీ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని ఈ ప్రాంతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి ఆజాద్ నగర్ కాలనీకి మౌలిక వసతులు అయినటువంటి కరెంటు, మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ, మొదలగు సౌకర్యాలు కల్పించాలని మంత్రి కి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ వినుకొండ నియోజకవర్గం కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, పట్టణ కార్యదర్శి ఉలవులపుడి రాము, మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు. (Story : ఆజాద్ నగర్ కాలనీ సమస్యలపై వినతి పత్రం)