హోం మంత్రిగా వంగలపూడి అనిత వైఫల్యం
ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజం
న్యూస్‌తెలుగు/ విశాఖపట్నం:
హోం మంత్రిగా వంగలపూడి అనిత పూర్తిగా విఫలమయ్యారని, ఆమె ఒక అసమర్థ హోం మంత్రి అని వైయస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. బాధ్యతల నిర్వహణలో విఫలమైన అనిత, తన హోదాను మర్చి అనుచిత విమర్శలు చేస్తూ, నిందలు వేస్తున్నారని, కనీస విజ్ఞత, గౌరవ మర్యాదలూ వదిలేశారని ఆమె ఆక్షేపించారు. రోజూ తమ పార్టీపై, జగన్‌గారిపై విమర్శలు చేయడమే అనిత ఎజెండాగా మారిందని అన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఎక్కడిక్కడ హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, ఆస్తుల విధ్వంసం కొనసాగుతున్నా, హోం మంత్రి ఏనాడూ స్పందించలేదని, చివరకు ముచ్చుమర్రిలో అత్యాచారానికి గురై అదృశ్యమైన బాలిక కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని గుర్తు చేశారు. అనితకు సన్మానాలపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేనే లేదని వరుదు కళ్యాణి తేల్చి చెప్పారు.
అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో జరిగిన బ్లాస్ట్‌పైనా హోం మంత్రి అబద్దాలు చెబుతున్నారన్న, వైయస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు.. ఆ ఘటనలో బాధితులను ఆదుకోవడంలోనూ, కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవడంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహించారు.
మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్‌లో అగ్ని ప్రమాదం జరిగితే, హుటాహుటిన డీజీపీ, సీఐడీ చీఫ్‌ను హెలికాప్టర్‌లో పంపిన విషయాన్ని గుర్తు చేసిన ఆమె.. అచ్యుతాపురం సెజ్‌లో బ్లాస్ట్ తర్వాత, సహాయ చర్యల పర్యవేక్షణకు ఎవరినీ, ఎందుకు పంపలేదని నిలదీశారు. అంటే కాగితాలకు ఇచ్చిన విలువ, ఉత్తరాంధ్ర ప్రజలపై లేదా? అని సూటిగా ప్రశ్నించారు.
జగన్‌గారిని ఏకవచనంతో సంబోధిస్తూ.. హోం మంత్రి చేస్తున్న విమర్శలు, సంస్కారహీనంగా చేస్తున్న వ్యాఖ్యలు.. మహిళా లోకానికే సిగ్గుచేటు అని వరుదు కళ్యాణి అభివర్ణించారు. గతంలో ఏ మహిళా హోం మంత్రి కూడా అనిత మాదిరిగా, దిగజారి మాట్లాడలేదని గుర్తు చేశారు. కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమైన అనిత, హోం మంత్రిగా బాధ్యతలు పూర్తిగా మర్చారని దుయ్యబట్టారు. చివరకు ఆమె సొంత జిల్లాలో ఒక బాలికపై అత్యాచారం జరిగితే, ఆమె చనిపోతే.. కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని.. ఆ బాలిక మృతదేహం మార్చురీలో ఉన్నప్పుడు, ఆ కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నప్పుడు.. మరో ఊరిలో సన్మానం కోసం అక్కణ్నుంచే వెళ్లిన హోం మంత్రి.. కనీసం వారిపైవు కన్నెత్తి కూడా చూడలేదని గుర్తు చేశారు.
నాడు ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ జరిగితే, అప్పటి సీఎం జగన్‌గారు రాలేదని హోం మంత్రి అనిత అబద్ధాలు చెబుతున్నారన్న ఎమ్మెల్సీ, కనీస వాస్తవాలు గుర్తించి మాట్లాడాలని చురకలంటించారు. తెల్లవారేసరికి మంత్రులతో సహా, ప్రభుత్వ యంత్రాంగమంతా అక్కడికి తరలి వెళ్లగా, మధ్యాహ్నానికే సీఎంగారు కూడా వచ్చారని, అప్పటి వరకు దేశంలో ఎక్కడా జరగని విధంగా, బాధితులకు ఏకంగా కోటి రూపాయల పరిహారం ఇప్పించారని, బాధితుల్లో ప్రతి ఒక్కరిని ఆదుకున్నారని గుర్తు చేశారు.
ఇకనైనా హోం మంత్రి బాధ్యతతో వ్యవహరించాలని, అనవసర విమర్శలు, నిందలు మానాలని, లేని పక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వరుదు కళ్యాణి స్పష్టం చేశారు. (Story : హోం మంత్రిగా వంగలపూడి అనిత వైఫల్యం)