అందరి సహకారంతో పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
న్యూస్‌తెలుగు/విజయనగరం : అందరి సహకారంతో ఆరోగ్యకరమైన, పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం నగరపాలక సంస్థకు చెందిన రెండు స్వీపింగ్ వాహనాలను స్థానిక శాసన సభ్యురాలు పూసపాటి అదితి గజపతిరాజు తో కలిసి ఆయన ప్రారంభించారు. అంతకు ముందు పైడితల్లమ్మ ఆలయ అభివృద్ధి పై కొద్దిసేపు అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరాన్ని పారిశుధ్య పరంగా మరింత మెరుగుపరిచేందుకు రెండు స్వీపింగ్ వాహనాలను ప్రారంభించామన్నారు. కోటి 30 లక్షల రూపాయలతో సమకూర్చిన స్వీపింగ్ వాహనాలతో ఆధునిక పద్ధతిలో పారిశుధ్యం మెరుగుదలకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ నేతృతంలో నెడ్ కేప్, 15 వ ఆర్థిక సంఘం నిధులతో వాహనాలను సమకూర్చడం జరిగిందన్నారు. నగరంలో మరింత పారిశుధ్య మెరుగుదలకు అధికారులతో చర్చించి కార్యచరణ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధికి అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. 2019లో పైడితల్లమ్మ సిరిమాను జాతర ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించినప్పటికీ తదుపరి ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లను సమకూర్చలేకపోయిందని అన్నారు. రాష్ట్ర పండుగగా అవసరమైన నిధులను విడుదల చేయించి ఈసారి సిరిమానోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులతో చర్చిస్తున్నమన్నారు. అలాగే ఆలయ పరిసరాలను అభివృద్ధిపరిచి భక్తులకు సులభతరమైన దర్శనాన్ని కల్పించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శాసన సభ్యురాలు అదితి గజపతిరాజు మాట్లాడుతూ నగరాన్ని మరింత పారిశుద్యపరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్వీపింగ్ వాహనాలతో ఎక్కడికక్కడ చెత్త తరలించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అందరి సమిష్టి కృషితో నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి, దేవస్థానం అధికారులు, తెదేపా నాయకులు ఐవిపి రాజు, పిల్లా విజయ్ కుమార్, కాళ్ళ గౌరీ శంకర్, కంది మురళి నాయుడు, అవనాపు విజయ్,ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, కనకల మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. (Story : అందరి సహకారంతో పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి)