అక్రమ లే అవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకోవాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : ఎల్.ఆర్.ఎస్ కు దరఖాస్తు చేసుకున్న అక్రమ లే అవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
గురువారం ఉదయం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ సంచి గంగ్వార్ తో కలిసి జిల్లా స్థాయి లేఔట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో టి.జి. బిపాస్ ద్వారా డి.టి.సి.పి. లేఅవుట్ లతో పాటు జిల్లాలో 2014 నుండి అక్రమ లే అవుట్ లు, ప్లాట్ల ఎల్.ఆర్. ఎస్ కొరకు వచ్చిన దరఖాస్తులు వాటిని క్రమబద్ధీకరించేందుకు తీసుకోవాల్సిన చర్యల పై సమీక్ష నిర్వహించారు.
అక్రమ లే అవుట్ లు, ప్లాట్ల ఎల్.ఆర్.ఎస్ కొరకు మొత్తం వచ్చిన దరఖాస్తులను చిన్న చిన్న క్లస్టర్ లు గా విభజించుకుని ఎల్.టి.పి.సి లు, డెవలపర్ లు, బిల్దర్లతో సమావేశం నిర్వహించాలన్నారు. ఎల్
ఆర్.ఎస్ కు దరఖాస్తు చేసుకున్న అక్రమ లే అవుట్లు, ప్లాట్లు ఎక్కడెక్కడ ఉన్నయో మ్యాపింగ్ చేసుకొని రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖ సిబ్బందితో కలిసి సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
లేఅవుట్ పక్క పట్టా భూమిలో చేశారా లేదా, రోడ్డు, విద్యుత్, ఈసి వంటివి పక్కగా ఉన్నాయా లేవా పరిశీలించాలన్నారు.
శిఖం భూమి, ప్రభుత్వ భూమి, గ్రామ కంఠం, హై టెన్షన్. వైర్లు, ఇరిగేషన్ కాలువ పక్కన, భూసేకరణ చేసిన భూమి వంటివి ఉంటే తిరస్కరించాలని లేని పక్షంలో క్రమబద్ధీకరించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ రోజే ఎల్.టి.పి.సి లతో సమావేశం ఏర్పాటు చేసుకొని మ్యాప్ లు తీసుకొని సంబంధిత లే అవుట్ లేదా ప్లాటు యజమానికి ఫోన్ చేసి మాట్లాడి క్రమబద్ధీకరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని అయిదు మున్సిపాలిటీల్లో కలిపి దాదాపు 45 వేల ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని క్రమబద్ధీకరించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.
వారంలో కనీసం 100 పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వనపర్తి మున్సిపాలిటీలో వారానికి 200 పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధారించారు. విలీన గ్రామాల్లో ఉన్న వాటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
డి.టి.సి.పి లే అవుట్ గురించి వివరిస్తూ డ్రాఫ్ట్ లే అవుట్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు వచ్చిన 30 రోజుల్లో తుది లే ఔట్ ఆమోదించాలని ఇందుకు టెక్నికల్ ఆఫీసర్, సైట్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ లు తమ లాగిన్ లో వచ్చిన వాటిని పరిశీలించి జిల్లా కమిటీకి పంపించాలని సూచించారు. ఆర్డీవో, పంచాయతీ రాజ్, రోడ్లు భవనాల శాఖ, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి తమ నివేదికలను సకాలంలో ఇవ్వాల్సి ఉంటుందని సూచించారు.
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, రోడ్లు భవనాల శాఖ డి . ఈ సీతారామ స్వామి, మున్సిపల్ కమిషనర్లు, టి.పి. ఒ లు, డి.టి.లు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. (Story : అక్రమ లే అవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకోవాలి)